అమరావతి : ఎపిలో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై సిఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పోలీస్ బెటాలియన్లలోనూ కోవిడ్ కేర్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలని చెప్పారు. కమ్యూనిటీ ఆస్పత్రుల స్ధాయి వరకూ ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిహెచ్‌సిల్లోనూ ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని, సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.










