Jan 17,2021 20:54

బేకర్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న విజరుకుమార్‌

కురుపాం : రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ప్రకృతి వ్యవసాయం తీసుకెళ్లడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని, ఇందుకు యూనిటెడ్‌ నేషన్‌, ఇతర సంస్థల సహకారం వస్తుందని రైతుసాధికార సంస్థ వైస్‌చైర్మన్‌ టి.విజరుకుమార్‌ అన్నారు. మండలంలోని ప్రకృతి వ్యవసాయ సాగు గ్రామమైన మంత్రజోలను ఆదివారం ఆయనతో పాటు యునైటెడ్‌ నేషన్‌ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ సత్య త్రిపాఠితో కలిసి సందర్శించారు. తొలుత జట్టు సంస్థ నిర్మించిన మిల్లెట్‌ బేకర్‌ యూనిట్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి 100శాతం ప్రకృతి వ్యవసాయం చేసిన గిరిజన గ్రామం కొండబారిడిని, ఏజెన్సీ మండలాల్లో 93 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం వంద శాతం వారికున్న విస్తీర్ణంలో చేస్తున్నామని అన్నారు. ఇది జిల్లాకే కాకుండా మిగతా జిల్లాల్లోనూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి స్ఫూర్తిని ఈ 93 గ్రామాల రైతులతో మాట్లాడామని తెలిపారు. ఈ గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళిక తయారు చేశామని అన్నారు. యునైటెడ్‌ నేషన్‌ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ సత్యత్రిపాఠి పరిశీలించారని, వారి పర్యటన వల్ల ప్రపంచ దేశాలకు రాష్ట్రంలో చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని తెలియస్తారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రకతి వ్యవసాయం ఒక ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి పదేపదే చెప్పారని, ఇందులో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జట్టు సంస్థ వ్యవస్థాపకులు డి.పారినాయుడు, జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ మేనేజర్‌ ప్రకాష్‌, రైతులు, మహిళలు పాల్గొన్నారు.