ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ హెల్పర్లు 'జీతాలివ్వండి మహాప్రభో' అంటూ వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టన్నట్టు వ్యవహరిస్తోంది. రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసినా, పదేపదే వినతిపత్రాలు అందజేసి మొరపెట్టుకున్నా..సంబంధిత శాఖాధికారుల్లో చలనం రావడం లేదు. మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్రమైన ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోతున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో మరింతగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. వేతనాల జాప్యానికి కారణమేటనేది ఇప్పటికీ స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారులు నిర్ధిష్టంగా చెప్పకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల ధర్నాలు చేపట్టడంతో కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు వంటి జిల్లాల్లో ఒక్క నెల వేతనం వేసినట్లు తెలిసింది.
వేతన బకాయిలు .. రూ.282 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా 48,700 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో వర్కర్, హెల్పర్ చొప్పున 97,400 మంది ఉన్నారు. మరో 5,600 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో మినీ వర్కర్లు ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 1,03,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పనిచేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్‌కి నెలకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7,000, మినీ వర్కర్‌కు రూ.7,000 చొప్పున ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది. వీటి ప్రకారం చూస్తే ఈ నెల 20కి అంగన్వాడీల వేతన బకాయి రూ.282.04 కోట్లకు చేరింది.
అంగన్‌వాడీ కేంద్రం అద్దెలూ ఇవ్వడం లేదు..
అద్దె భవనాల్లో కొనసాగిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు గత 5 నెలలుగా ప్రభుత్వం నుండి అందాల్సిన అద్దె డబ్బులు కూడా నిలిచిపోయాయి. రాష్ట్రంలో దాదాపు 34 వేల అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటికి స్త్రీ, శిశు సంక్షేమశాఖ గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.1,000, మున్సిపాలిటీ సెంటర్లకు రూ.4 వేలు, కార్పొరేషన్ పరిధిలోని సెంటర్లకు రూ.5 వేలు చొప్పున అద్దె చెల్లిస్తోంది. దీంతో భవన యజమానులు అద్దె కోసం అంగన్‌వాడీ వర్కర్లను, హెల్పర్లను నిలదీస్తుండటంతో మానసిక వేదనకు గురౌతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధిóకారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వేతనాలను, అద్దెలను సకాలంలో చెల్లించాలని అంగన్‌డీలు కోరుతున్నారు.










