- వెల్లివిరిసిన హిందూ-ముస్లిం ఐక్యత
భారత జాతీయోద్యమం ఉధృతంగా సాగిన ప్రదేశాల్లో ఆంధ్ర ప్రాంతం ఒకటి. గాంధీజీ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కింద రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వచ్చారు. వారిలో హిందువులతోపాటు అనేక మంది ముస్లిం యువకులు అటు రాయలసీమలోని అనంతపురం నుండి ఇటు ఉత్తరాంధ్రలోని విశాఖ పట్నం వరకు ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లారు, నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఇంకోవైపు రష్యాలో అక్టోబరు విప్ల ప్రభాంతో సోషలిస్టు భావాలు అలవరుచుకున్న అనేక మంది రాష్ట్ర యువకులు కమ్యూనిస్టులుగా మారి ప్రజల సంపూర్ణ విముక్తి కోసం జాతీయోద్యమంలోకి ఉరికారు. రాష్ట్రానికి చెందిన దర్శి చెంచయ్య వంటి వారు గదర్ పార్టీలో చేసి దేశ విముక్తి కోసం పోరాడారు. బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు హిందువులు ముసల్లిం మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నాలను రెండు మతాల్లోని ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టారు. కానీ అంతటి బృహత్తరమైన, త్యాగపూరితమైన ఉద్యమంలో అసలు పాల్గొనకుండా దూరంగా ఉన్నది నేటి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌లకు పూర్వ రూపమైన జనసంఫ్‌ు, హిందూ మహాసభలు మాత్రమే. వాస్తవానికి వారు దూరంగా ఉండడమే కాదు బ్రిటిష్ వారితో కుమ్మక్కై జాతీయోద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారని చరిత్ర మనకు తెలుపుతోంది. విశేషమేమంటే నాడు బ్రిటిష్ వారు జాతీయోద్యమాన్ని నిలువరించడానికి హిందూ-ముస్లింలను విభజించడానికి ప్రయత్నిస్తే నేడు వారి వారసత్వం తీసుకున్న బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ పరివారం రాష్ట్రంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టడమే ఎజెండాగా అనేక కుట్రలకూ, కుయుక్తులకూ పాల్పడుతున్నారు.
రష్యా శ్రామిక విప్లవం, బెంగాల్ విభజన వంటి రాజకీయ పరిణామాలు, ప్రభావాలతో రాష్ట్రంలో ఉద్యమం మిలిటెంట్ రూపం తీసుకుంది. జలియన్ వలాభాగ్ ఊచకోత, సహాయ నిరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమాల ప్రభావాలతో హిందూ ముస్లింలలోని సామాన్య ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వచ్చారు. గాంధీజీ 1919 మార్చి 31న విజయవాడ వచ్చి రామ్మోహన్ లైబ్రరీ వద్ద జరిగిన సత్యాగ్రహ సమావేశంలో పాల్గొన్నారు. గాంధీజీ పాల్గొన్న సమావేశాల్లో హిందువులతోపాటు ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 1920లో గాంధీ ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు ఖిలాఫత్ ఉద్యమ ప్రముఖులైన ఆలీ సోదరులను వంటి తీసుకు వాచ్చారు. ఆ ఏడాది జనవరి 1న జరిగిన సభలో గాంధీ ప్రసంగిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం అందజేసిన బిరుదులను త్యజించాలని, పదవులను వదులుకోవాలని కోరారు. ఆ పిలుపుకు విజయవాడకు చెందిన జాగీర్దార్ ముహమ్మద్ గులాం మొహియుద్దీన్ సాహెబ్ తక్షణమే స్పందించి తన పదవికి రాజీనామా చేశారు. ఆ విధంగా గాంధీజీ పిలుపుకు స్పందించి ప్రభుత్వ పదవిని త్యజించిన తొలి ఆంధ్రుడిగా గులాం మొహిద్దీన్ ఖ్యాతిగాంచారు.
రాష్ట్రలంలో మొదటి నుండీ చివరి వరకు స్వాతంత్య్ర పోరాటంలో హిందూ, ముస్లింలు ఐక్యంగా పాల్గొన్నారు. తొలిసారిగా 1780లో విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలో జరిగిన తిరుగుబాటుకు సుబేదార్ షేక్ అహమ్మద్ నాయకత్వం వహించి స్థావరంలోని ధనాన్ని, ఆయుధాలను సుబేదార్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత అంగ్లేయుల తొత్తులుగా మారిన జమీందార్ల కారణంగా, షేక్ సుబేదార్ అహమ్మద్‌తోపాటుగా తిరుగుబాటు యోధులమరణశిక్షలకు బలయ్యారు. గాంధీజీ పిలుపు మేరకు బెజవాడలో ముస్లింలు ప్రార్థనల అనంతరం రౌలత్ చట్టానికి వ్యతిరేకంగాపెద్ద సభ జరిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన సభలో ప్రముఖ కవి మౌల్వీ ఉమర్ అలీషా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉపన్యసించారు. భౌతికంగా కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా ఆర్థికంగా చాలా మంది సంపన్నులు ఆదుకోవడం జరిగింది. రాయలసీమలోని తాడిపత్రికి చెందిన సులేమాన్ సాహెబ్ సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు 1921 నవంబరు 25న ఆయనను అరెస్టు చేసి ఆయన ఆరు మాసాల పాటు బళ్ళారి సెంట్రల్ జైలులో నిర్బంధించారు. తాడిపత్రి నివాసి అబ్దుల్లా సాహెబ్ ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఐదు మాసాల జైలుశిక్ష పడింది. ఆయనతో పాటుగా తిరుపతి నివాసి మదార్ సాహెబ్, తాడిపత్రి చెందిన మరొకరు షేక్ మాలిక్ షక్కర్ బరూన్ పలు శిక్షలకు గురయ్యారని ఇంకా అనేక ముస్లిం యువకులు, ప్రజలు పెద్ద ఎత్తునన రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమంలో పాల్గొన్నారనీ అయ్యదేవర కాళేశ్వరావు తన జీవిత కథలో రాశారు.
గుంటూరు జిల్లా పల్నాటి పుల్లరి ఉద్యమంలో సాటి ముస్లిమేతర సోదరులతోపాటుగా ముస్లింలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోరాటంలో చింతపల్లి హుస్సేన్ సాహెబ్, జాన్ మహమ్మద్‌లు తొలుత అరెస్టయిన దేశభక్తుల్లో ఉన్నారని 'గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం' పుస్తకంలో మాదాల వీరభద్రరావు రాశారు. అంతే కాకుండా చీరాల-పేరాల ఉద్యమంలో బాపట్లకు చెందిన మహమ్మద్ గౌస్ బేగ్ ఎంతగానో కషి చేయడమే కాకుండా ఉద్యమం కోసం తన ఆస్తిని పూర్తిగా వ్యయం చేశారనీ, ఈయన పెదనందిపాడు పన్ను నిరాకరణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారని వీరభద్రరావ రాశారు. జాతి స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం సాగిన జాతీయోధ్యమంలో జరిగిన పోరాటాలలో పాల్గొన్నందుకు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన అబ్దుల్ సాహెబ్ ఐదు మాసాల కఠిన కారాగారవాస శిక్షను అనుభవించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన మదార్ సాహెబ్ నెల్లూరు, కండలూరు జైళ్లలో 15మాసాలు, 1921లో మధ్యనిషేధం ఉద్యమంలో పాల్గొన్నందుకు మరో సంవత్సరం జైలుశిక్షను అనుభవించారు. విశాఖపట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రజాక్ పలుసార్లు జైలు పాలయ్యారు. కష్ణాజిల్లా నూజివీడు నివాసి కొత్వాల్ అబ్బాస్ అలీ సాహెబ్ 9 మాసాలు రాజమండ్రి జైలులో గడిపారు. విజయవాడకు చెందిన ససీరుల్లా ఖాన్ నాలుగు మాసాలు, నూజివీడు నివాసి మొహిద్దీన్ బెగ్ నాలుగు మాసాలు, గుడివాడ నివాసి ఖాశిం బేగ్ రెండు మాసాలు రాజమండ్రి జైలులో గడిపారు. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా వాసి మహమ్మద్ అక్బర్ సాహెబ్ నెల్లూరు, కడలూరు జైళ్ళలో ఏడాది జైలు జీవితం గడిపారు. కోవూరు తాలూకాకు చెందిన మహమ్మద్ అక్బర్ సాహెబ్ నెల్లూరు, కడలూరు జైళ్ళలో ఏడాది జైలు జీవితం గడిపారు. నెల్లూరుకు చెందిన వ్యాపారి మహమ్మద్ గౌస్ సాహెబ్ ఆరు మాసాలు, గుంటూరు జిల్లాకు చెందిన అబ్దుల్ హుదా సాహెబ్ ఒక సంవత్సరం జైలుశిక్ష అనుభవించారు. సత్తెనపల్లి చెందిన రైతు షేక్ మీర్జా ఆలీ సాహెబ్ పన్ను వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో పాల్గొని ఆరు మాసాలు జైలులో గడిపారు. అదిలాబాద్‌కు చెందిన సయ్యద్ ఇబ్రహీం జిల్లాలో ఖిలాఫత్ ఉద్యమాన్ని నడిపి జైలు పాలయ్యారు. ఈ విధంగా విజయవాడకు చెందిన మొహమ్మద్ నూరుల్లా ఖాన్, కష్ణానగర్ నివాసి మహమ్మద్ మింటో, నూజివీడుకు చెందిన మొహినుద్దీన్ ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుశిక్షను అనుభవించారు... ఇవన్నీ ముస్లిం దేశభక్తుల త్యాగాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఈ త్యాగాల చరిత్రను పక్కనబెట్టి, స్వాతంత్య్రోమంలో హిందూ ముస్లింల మధ్య తెచ్చిన ఐక్యతను, అనేక తరాలుగా వారి మధ్య ఏర్పడిన సామరస్యాన్నీ దెబ్బ తీయడం కోసం మన రాష్ట్రంలోని బిజెపి నేతలు కంకణం కట్టుకుని ప్రయత్నిస్తున్నారని ఇటీవల వారు చేస్తున్న ప్రకటనలు, పాల్పడుతున్న కుట్రలూ తెలియజేస్తున్నాయి. జాతీయోద్యమం ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తే జాతీయోద్యమంలో ఏమాత్రం పాల్గొనకపోగా దానికి తీవ్రమైన ద్రోహం చేసిన బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ప్రజలను మతాల వారీగా చీల్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విద్రోహ శక్తుల కుట్రలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం నేటి తరుణంలో చాలా అవసరం.
-ఎస్. వెంకట్రావు

రెవెన్యూ, పారిశుధ్యం, పోలీసు, న్యాయం లేదా ప్రజాప్రయోజనాల వినియోగం విషయాలలో హిందూ ముస్లింల నడుమ ప్రయోజనాలపరంగా ఏం వైరుధ్యం వుంటుంది? తేడా అంతా మతావలంబనలో, ఆచారాలలో వుంటుంది. వాటితో లౌకిక రాజ్యానికి సంబంధమే లేదు.
- గాంధీజీ

మతతత్వం మౌలికంగా ఒక భావజాలం. అంటే నా ఉద్దేశంలో... అదొక విశ్వాస వ్యవస్థ. లేదా పరస్పర ఆధారితమైన కొన్ని భావనల సమూహం. వాటి ప్రాతిపదికగా రాజ్య తంత్రానికి, సమాజానికి అర్ధం చెబుతారు. మరో విధంగా పేర్కొనాలంటే రాజకీయాలను, సమాజాన్ని వీక్షించే ఒక విధానమే మతతత్వం. ఆ భావజాలం కేంద్రంగా రాజకీయాలను నడపడమే మతతత్వం.
- బిపన్ చంద్ర, ప్రముఖ చరిత్రకారుడు










