Apr 19,2022 06:31

అంత హడావుడిగా బ్యాగులో బట్టలు సర్దుతున్నావ్‌? ఎక్కడికేంటి ప్రయాణం అన్నాడు వినోద్‌ తన స్నేహితుడు అనిల్‌తో. ట్రైన్‌కు టైమైపోతుందిరా... ఢిల్లీ బయలు దేరాను...అంటూ హడావుడి పడుతూ తన సరంజామా సర్దుకుంటున్నాడు అనిల్‌. ఏం ఏదైనా మంచి ఆఫర్‌ వచ్చిందా! సడన్‌గా బయలుదేరుతున్నావ్‌ అన్నాడు వినోద్‌. అబ్బే అదేం లేదురా.. డిల్లీలో కొత్తగా ఒక హిస్టారికల్‌ మ్యూజియంను ప్రారంభించారట. దానిని చూడ్డానికిరా అన్నాడు అనిల్‌. ఏంటి... అంత గొప్ప మ్యూజియమా! దేని గురించేంటి?  ఎక్కడేంటి? అన్నాడు వినోద్‌. అవునురా.. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనికి సారథులుగా నిలిచిన 14 మంది ప్రధానుల జీవిత గమనం, పరిపాలనా క్రమం, వారి త్యాగాలకు ప్రతిబింబంగా ఢిల్లీ లోని తీన్‌మూర్తి ఎస్టేట్‌ భవన్‌లో నిర్మించిన ఈ మ్యూజియంను ప్రధాని మోడీ గారు మొన్న ప్రారంభించారు. అది కూడా డా||బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి రోజున అన్నాడు అనిల్‌. 14 మంది ప్రధానులు దేశాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి గల కారణాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చని మ్యూజియం బయలుదేరాను. అంతేకాదు. దేశ చరిత్ర, స్వాతంత్య్ర సంగ్రామం యొక్క కథనాలు ఈ మ్యూజియంలో ఉన్నాయట. అందుకే వెళుతున్నానన్నాడు అనిల్‌.
    ఒరే అనిల్‌.. ఆ ప్రధానుల గురించి తెలుసుకోవడం గురించి అటుంచి, ముందు ఈ 14వ ప్రధాని...అదే మన మోడీజీ గురించి తెలుసుకోవడం చాలా అవసరంరా! లేదంటే మన భవిష్యత్‌ అంతా అంధకారమౌతుందేమోనని భయంగా ఉందన్నాడు వినోద్‌.
     రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి రోజు ఈ మ్యూజియంను ప్రారంభించానని గొప్పగా చెప్పుకుంటున్న ఈ 14వ నెంబర్‌ గారు, ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, రిజర్వేషన్లనే ఎత్తివేయాలనే కుట్రలు చేస్తూ, రాజ్యాంగాన్ని తిరగరాయాలని చూస్తు... అంబేద్కర్‌ జయంతి రోజే ప్రారంభించారంటే ఈయన గారి తెలివితేటలు ఏమిటో అర్ధం చేసుకో... అన్నాడు వినోద్‌. ఈయన గారి ముందున్న 13 మంది ప్రధానులు దేశ ఔన్నత్యానికి ఎంతో కొంత కృషి చేసిన మాట వాస్తవమే అయినా వారి కాలంలో జరిగిన కొన్ని పోరపాటు నిర్ణయాలు, సంఘటనలు, విధానాలు ఉన్నా, ఆ కాలంలో ఎంతోకొంత పురోగమనం సాధించాం. కానీ ఈ 14వ ప్రధాని గారు వచ్చినప్పటి నుండీ అంతా తిరోగమనమేరా! అంతేకాదు. మనుధర్మ శాస్త్రాన్ని తలకెక్కించుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌ కనుసన్నల్లో ఈయన గారు ప్రయాణం చేస్తున్నార్రా అన్నాడు వినోద్‌. మోడీజీని ప్రపంచమంతా పొగుడుతుంటే నువ్వేంట్రా ఇలా అంటున్నావ్‌. 'నమస్తే ట్రంప్‌' పేరుతో అమెరికా పెద్దాయన్నే దేశానికి తెచ్చాడు. మొన్ననే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంపై మధ్యవర్తిత్వం వహించాడని పేపర్లో చదివాను. దేశంలో కోవిడ్‌ను చప్పట్లు, బాజాలు వాయించి, దీపాలు వెలిగించి తరిమేశాడని గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నాడు అనిల్‌. అది ఎంత వాస్తవమో దీని ప్రచారకులకే తెసుగానీ, ఈయన గారి ఘనకార్యాలు మ్యూజియంకెళ్లి తెలుసుకునే ముందు మచ్చుకి కొన్ని చెబుతాను విను అన్నాడు వినోద్‌.
     మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ''దేశానికి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఆధునిక దేవాలయాలు''గా అభివర్ణించి అభివృద్ధి చేస్తే ఈ 14 నెంబర్‌ మాత్రం ''ప్రభుత్వ రంగం చావడానికే పుట్టాయని'' తెగనమ్ముతున్నాడు. దీంతో నీలాంటి నిరుద్యోగులు భవిష్యత్‌లో ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ఉద్యోగాలకు దూరమైపోవడమే అన్నాడు వినోద్‌. ఇందిరాగాంధీ లాంటివారు 1977 దేశంలో ఎమర్జెన్సీ విధించి చీకటి రోజులు చూపించినా... గరీభీ హఠావో, బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు చేస్తే, ఈయన గారు ఉన్న బ్యాంకులను మెర్జింగ్‌, ప్రైవేటీకరణ పేరుతో ఆర్థిక వ్యవస్థనే విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నాడు. పైగా హఠాత్తుగా మోనిటైజేషన్‌ పేరుతో పెద్ద నోట్లు రద్దు చేసి ఇదే బ్యాంకుల వద్ద ప్రజల్ని క్యూలైన్లు కట్టించి వందలాది మందిని బలితీసుకున్నాడు. మరో ప్రధాని పి.వి.నరసింహారావు లాంటి వారు నూతన ఆర్థిక విధానాలకు ఆజ్యం పోస్తే.. ఆ విధానాలకు పదును పెట్టి మొత్తం దేశ సంపదనే అదానీ, అంబానీ, టాటాలకు కట్టబెట్టేందుకు ''డీమోనిటైజేషన్‌'' పేరుతో సమస్త వనరుల్ని అమ్మేస్తున్నాడు. వాజ్‌పేయి గారు పెట్రోలియం ఉత్పత్తుల ఆయిల్‌పూల్‌ ఖాతాలను ఎత్తివేస్తే... ఆ పెట్రోలియం ఉత్పత్తులనే కార్పొరేట్లకు ధారాదత్తం చేసి ప్రజలపై ప్రతి రోజూ పెట్రోల్‌, డీజిల్‌ భారాలు వేస్తున్నాడు. నాడు బాబ్రీ మసీదు కూల్చి మత ఉద్రిక్తతలకు కారణమైన మతోన్మాదులు, నేడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మతం పేరుతో మారణహోమాలు సృష్టిస్తూ మైనార్టీలపై హత్యలు, దాడులకు పాల్పడుతున్నారన్నాడు వినోద్‌. అదేంటీ ఈ 75 ఏళ్ల భారతావని ఘనతను చాటుతూ మోడీ గారు ''ఆజాదీకా అమృత మహోత్సవ్‌'' పేరుతో దేశ మంతా ఉత్సవాలు జరుపుతుంటే నేవ్వేంటి ఇలా చెబుతున్నావ్‌ అన్నాడు అనిల్‌. నీలాంటి వాడే రామాయణమంతా విని రాముడికి లక్ష్మణుడు బావమర్దే కదా అన్నాడట! అసలు స్వాతంత్య్ర పోరాటంలోనే వీరి పాత్ర లేదని, పైగా బ్రిటీషర్లకు శరణు వేడి తప్పించుకున్న చరిత్ర గలిగిన వారసులుగా ఉన్న వీరికోసం ఆ మ్యూజియంలో వెతికేకంటే... మొన్నటి వరకు ఢిల్లీ సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడిన రైతాంగాన్ని అడగాలి. పౌరసత్వం పేరుతో దేశ రాజధానితో సహా అనేక రాష్ట్రాల్లో చిచ్చురేపి.. ఆ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపి నిర్బంధించిన వారిని అడగాలి. పౌర హక్కులపై పోరాడుతూ... వీరి అరాచకాలను ప్రశ్నిస్తున్నారని దేశద్రోహం కేసుకు బనాయించి జైళ్లలో మగ్గుతున్నవారిని అడగాలి అన్నాడు వినోద్‌.
     దేశ స్వాతంత్య్రానికి నాయకత్వం వహించిన గాంధీని చంపిన గాడ్సే వారసులుగా ఉన్న ఈ ఆర్‌ఎస్‌ఎస్‌ వాదుల ఘన చరిత్ర చెప్పుకుంటూ పోతే చాంతాడులా పెద్దదే ఉందికానీ 'అందరికంటే ఘనుడు ఆచంట మల్లన్న' అన్నట్లు ఆ 13 మంది ప్రధానమంత్రుల మ్యూజియం ఎలా ఉన్నా, 14వ ప్రధానిగా ఉన్న మోడీ గారు అంతకంటే ఘనుడుగా పేరుగాంచాడు. ఈయన గారి ఘనకార్యాల గురించి ఎన్ని మ్యూజియంలు నిర్మించినా సరిపోవు. అందుకే 15వ ప్రధానిగా మోడీజీ రాకూండా చేయాలనే కృతనిశ్చయంతో ఈయన గారి ఘన చరిత్రను ఊరూరా చాటాలన్నాడు వినోద్‌.
      ఢిల్లీ మ్యూజియంలో ఎలాంటి చరిత్ర ఉందో... ఎన్ని వక్రీకరణలు ఉన్నాయో అటుంచితే... మోడీ గారి చరిత్రను బాగా చెప్పావురా వినోద్‌. అందుకే నా ఢిల్లీ ప్రయాణాన్ని విరమించుకుంటున్నానురా అని బ్యాగును పక్కన పడేశాడు అనిల్‌.
 

- వి.వి. శ్రీనివాసరావు,
సెల్‌ : 9490098799