ప్రజాశక్తి - వన్‌టౌన్
దుర్గగుడిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మూడవ రోజు బుధవారం అమ్మవారు శ్రీ గాయత్రిదేవి అవతారంలో దర్శన మిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మాజీ డీజీపి, ఏపిపిఎస్‌సి చైర్మన్ గౌతం సవాంగ్, జిల్లా కలెక్టర్ డిల్లీరావు, సిపి కాంతా రాణా టాటా, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌లు గాయత్రీదేవి అలంకారంలో వున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియా సెంటర్ వద్ద డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ తన ఇష్ట దైవమైన గాయత్రీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనంద దాయకమన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవిం చాలని, రాష్ట్రం సస్యశామలంగా పాడి పంటలతో కళకళలాడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు, దివ్యాంగులకు ముఖ్య అతిధులకు ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేసిన ఏర్పాట్లు సంతోష దాయకమని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు, ఎవ్వరికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేసిన ప్రత్యేక ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు.










