Jul 09,2020 07:06

     పాలస్తీనీయులను వారి సొంత గడ్డ పైనే శరణార్థులుగా మార్చి, వారి భూములను ఆక్రమించుకున్న యూదు దుర్హంకార ఇజ్రాయిల్‌ తాజాగా మరో దుర్మార్గమైన దాడికి తెగబడింది. ఇప్పటికే ఆక్రమించుకున్న పాలస్తీనా లోని ముఖ్యమైన వెస్ట్‌ బ్యాంక్‌ భూ భాగాలను బలవంతంగా తనలో కలుపుకుంటున్నది. అమెరికా అండచూసుకునే ఇజ్రాయిల్‌ ఇంతగా రెచ్చిపోతున్నది. 1917లో అమెరికా మద్దతుతో వచ్చిన 'బాల్ఫోర్‌ డిక్లరేషన్‌' ఆధారంగా 1948లో ఇజ్రాయిల్‌ ఏర్పడింది. పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేసినప్పుడు 8 శాతం ప్రాంతానికి పరిమితమైన యూదులు, ఈ డెబ్బయ్యేళ్లలో 80 శాతం దాకా భూ భాగాన్ని ఆక్రమించేశారు. అక్రమంగా ఆక్రమించుకున్న ఆ ప్రాంతాలపై తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించేందుకు నెతన్యాహు ప్రభుత్వం 'బలవంతపు విలీనీకరణ'ను తెర పైకి తీసుకొచ్చింది. ట్రంప్‌ ప్రభుత్వ ఆమోదంతోనే నెతన్యాహు ఈ విలీన ప్రణాళికను తెర పైకి తెచ్చారు. గత జనవరిలో ట్రంప్‌ ఏకపక్షంగా ప్రకటించిన 'డీల్‌ ఆఫ్‌ సెంచరీ' నెతన్యాహు గ్రేటర్‌ ఇజ్రాయిల్‌ ప్రణాళికకు ప్రేరణ. పాలస్తీనా భూభాగంలో నిర్మించిన సెటిల్మెంట్లను (నివాస కాలనీలను), మృత సముద్రాన్ని (డెడ్‌ సీ) ఆనుకుని 105 కి. మీ. పొడవునా గల జోర్డాన్‌ నదీ లోయ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకోవాలన్నది నెతన్యాహు పన్నాగం. అంతర్జాతీయంగా దీనికి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో దీని అమలు బాధ్యతను స్థానిక కౌన్సిళ్లకు అప్పగించారు. ఈ విలీనాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించేది లేదని పాలస్తీనా అథారిటీ (పి.ఎ) చైర్మన్‌ మహ్మద్‌ అబ్బాస్‌ హెచ్చరించారు. గాజాపై పట్టు ఉన్న పోరాటవాద సంస్థ హమాస్‌ ఈ బలవంతపు విలీనీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. ఇజ్రాయిల్‌ చర్య జెనీవా తీర్మానాన్ని బాహాటంగా అతిక్రమించడమేనని పలువురు సామాజిక, రాజకీయ కార్యకర్తలు విమర్శించారు. జర్మనీలో నాజీ హిట్లర్‌ సాగించిన ఊచకోత లాంటివి పునరావృతం కాకుండా చూడాలని, 1967కి ముందు పాలస్తీనీయులు నివసించిన వెస్ట్‌ బ్యాంక్‌, తూర్పు జెరూసలెంపై వారికి గల హక్కు ప్రశ్నించడానికి వీల్లేనిదని జెనీవా తీర్మానం స్పష్టం చేస్తోంది. 'రెండు జాతులు-రెండు దేశాలు' అన్న సూత్రానికి ఇరు పక్షాలు కట్టుబడి వుండాలని చెబుతున్న 1993 ఓస్లో ఒడంబడికను ఇజ్రాయిల్‌ ఎన్నడూ గౌరవించిన పాపాన పోలేదు. పాలస్తీనా దేశం ఏర్పాటును అడ్డుకునేందుకు నెతన్యాహు రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు. పాలస్తీనీయుల స్వయం నిర్ణయాధికారానికి గ్యారంటీ ఇస్తున్న భద్రతా మండలి తీర్మానాలు (నెం.242, నెం.33) అంటే ఆయనకు లెక్క లేదు. ఐరాస నియమావళిని, అంతర్జాతీయ చట్టాలు, నియమ నిబంధనలను బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు. ఇజ్రాయిల్‌ దుర్మార్గాలకు వ్యతిరేకంగా భద్రతామండలిలో తీర్మానం వచ్చిన ప్రతిసారి అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నది. చమురు వనరులు పుష్కలంగా ఉన్న పశ్చిమాసియాలో ఇరాన్‌ను దెబ్బ తీయడం, ఇజ్రాయిల్‌-సౌదీ అరేబియా మధ్య దోస్తీ కుదర్చడం వంటి ఎత్తులతో అమెరికా ఈ ప్రాంతంలో తన భౌగోళిక, రాజకీయ, వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తున్నది. ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్‌ను బలీయమైన సైనిక శక్తిగా నిలపడం ద్వారా మధ్య ప్రాచ్యంపై తన ఆధిపత్యానికి ఎదురు లేకుండా చూసుకోవాలన్నది దాని వ్యూహం. ఈ విలీనీకరణ పర్యవసానాల గురించి మిలిటరీ అధికారులు హెచ్చరించినా వినకుండా నెతన్యాహు మొండిగా ముందుకెళ్తున్నారు. స్థానికేతరులెవరినీ జోర్డాన్‌ నదీ లోయ ప్రాంతం లోకి అనుమతించడం లేదు. వెస్ట్‌ బ్యాంక్‌ పట్టణానికి-జోర్డాన్‌ రివర్‌ వ్యాలీకి మధ్య మార్గాన్ని దిగ్బంధనం చేయడం వంటి చర్యలకు ఇజ్రాయిల్‌ పాల్పడుతోంది. దీనికి హమాస్‌ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నది. పాలస్తీనా నుంచి గెంటివేయబడిన వారిలో ఎక్కువ మంది పొరుగు దేశాలైన జోర్డాన్‌, ఈజిప్టుల్లో ఎక్కువగా తలదాచుకుంటున్నారు. కాబట్టి ఈ రెండు దేశాలు ఇజ్రాయిల్‌ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనీయులతో శాంతికి విఘాతం కలిగించే ఈ విలీన ప్రణాళికను వెంటనే విరమించుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోని గుటెరస్‌ కోరారు. ఇజ్రాయిల్‌ చర్య అక్రమమని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ మిచెలీ బచెలెట్‌ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ తదితర యూరపు దేశాలు జోర్డాన్‌ రివర్‌ వ్యాలీ విలీనాన్ని గుర్తించబోమని ప్రకటించాయి.
విలీనం కోరుతున్నదెవరు?
     ఇజ్రాయిల్‌ లోని పలుకుబడి కలిగిన రాజకీయ వర్గాలు, మరీ ముఖ్యంగా మితవాదులు ఈ విలీనాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. పాలస్తీనా లోని వెస్ట్‌ బ్యాంకు మొత్తాన్ని కలుపుకుకోవాలని వీరు చూస్తున్నారు. యూదుల సెటిల్మెంట్‌ కాలనీలనన్నిటినీ ఇజ్రాయిలీ సార్వభౌమాధికారం కిందికి తీసుకొస్తూ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మితవాదుల్లో ఎక్కువ మంది యూదు జాతి దుర్హంకారులు. విలీనం తరువాత వెస్ట్‌బ్యాంకులో కొత్త సెటిల్మెంట్లను నిర్మించుకోవచ్చనేది వీరి ఆలోచన. ఈ మితవాదుల నాయకుడు నెతన్యాహు.
ఆక్రమణలు, ఊచకోతలే ఇజ్రాయిల్‌ చరిత్ర
     1948లో జెరూసలెం పశ్చిమ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు నడచిన ఇజ్రాయిల్‌ చరిత్ర అంతా దాడులు, దౌర్జన్యాలు, పాలస్తీనీయుల ఊచకోతలు, వారి భూముల ఆక్రమణలు, స్వాధీనాలు, విధ్వంసాలు, ప్రజల ఆస్తులు, చారిత్రక కట్టడాల పేర్ల మార్పు వంటి వాటితో నిండిపోయింది. వివక్షాపూరిత ఇజ్రాయిలీ ప్రభుత్వాలు పాలస్తీనీయులపై సాగించని అకృత్యం లేదు. వారికి ఒక దేశం అంటూ లేకుండా చేసింది. గత ఏడు దశాబ్దాలుగా పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఈ దాష్టీకాలను ఎంత ఖండించినా తక్కువే. ఇజ్రాయిల్‌ పాలస్తీనీయులను పెద్దయెత్తున ఊచకోత కోసినప్పుడు, వారిపై క్రూరమైన దాడులకు తెగబడినప్పుడు అంతర్జాతీయ సమాజం మేల్కొంటున్నది. తరువాత ఇజ్రాయిల్‌తో ఎప్పటిలానే సంబంధాలు కొనసాగిస్తున్నది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఎక్కడలేని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మితవాద బిజెపి అధికారం లోకి వచ్చినప్పుడల్లా ఇజ్రాయిల్‌తో సన్నిహిత సంబంధాలు బలపరచుకోవాలని తహతహలాడుతోంది. 2003లో బిజెపి తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఇజ్రాయిల్‌ ప్రధాని షరోన్‌ను భారత్‌కు ఆహ్వానించి, సకల మర్యాదలు చేసింది. 2014లో బిజెపి రెండోసారి అధికారంలోకి రాగానే ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ను సందర్శించి తరించిపోయారు. ఆ తరువాత ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహును భారత్‌కు ఆహ్వానించారు. నెతన్యాహు పర్యటనను వ్యతిరేకిస్తూ దేశమంతటా నిరసనలు వ్యక్తమైనా మోడీ ప్రభుత్వం లెక్కచేయలేదు. ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కన పెట్టి ఇజ్రాయిల్‌ నేతను కావలించుకున్న తీరుచూసి చాలా మంది నిశ్చేష్టులయ్యారు. పాలస్తీనా పట్ల ఇజ్రాయిల్‌ వైఖరిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి 77 సార్లు తీర్మానాలు తెచ్చింది. ఆ దేశాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలిపింది. అయినా ఈ తీర్మానాలను ఇజ్రాయిల్‌ తుంగలో తొక్కుతూ, పాలస్తీనీయుల మానవ హక్కులను యథేచ్ఛగా కాలరాస్తోంది. సిద్ధాంతపరంగా చూస్తే నెతన్యాహు నేతృత్వం లోని పచ్చి మితవాద లీకుడ్‌ పార్టీకి, మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపికి మధ్య తేడా ఏమీ లేదు. అక్కడ లీకుడ్‌ పార్టీ యూదు జాతీయవాదాన్ని రెచ్చగొడుతుంటే, ఇక్కడ బిజెపి హిందూత్వ జాతీయవాదాన్ని రెచ్చగొడుతున్నది. గోబెల్స్‌ తరహా ప్రచారం, నాజీ తరహా దాడుల్లో దొందూ దొందే. అమెరికా అండ చూసుకుని పేట్రేగిపోతున్న ఇజ్రాయిల్‌ను అంతర్జాతీయంగా ఒంటరిపాటు చేయాలి. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతి దుర్హంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాడు అంతర్జాతీయ సమాజం ఎలా స్పందించిందో ఇప్పుడూ అదే విధంగా స్పందించి యూదు దుర్హంకార ఇజ్రాయిల్‌కు ముకుతాడు వేయాలి. ఒంటరిపాటు చేయడం, ఆంక్షలు, బహిష్కరణ వంటి చర్యల ద్వారానే ఇజ్రాయిల్‌ దుందుడుకు చర్యలను అడ్డుకోగలం. పాలస్తీనాను కాపాడుకోగలం.
                                                                 * కె. గడ్డెన్న (వ్యాసకర్త)