28న విజయవాడ ఎం.బి.వి.కె బాలోత్సవ్ భవన్‌లో కొమ్మారెడ్డి కేశవరెడ్డి స్మారక సాహితీ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా...
క్రమశిక్షణ, అంకిత భావం, ఉదాత్త మానవీయ విలువలు, ఎంత కృషి చేసినా వినమ్రంగా మసలే సంస్కారం నిండిన పెద్దాయన కొమ్మారెడ్డి కేశవరెడ్డి. ఆయన మృతితో ఉపాధ్యాయ ఉద్యమం ఒక మంచి నాయకుడిని కోల్పోయింది. తెలుగు పుస్తక ప్రపంచం సమర్థుడైన శక్తివంతుడైన అనువాదకుణ్ని పోగొట్టుకుంది. తన వల్ల ఉత్తేజం పొంది అభ్యుదయ భావజాలం వైపు ఆకర్షితులై ఆశయాల బాటలో ముందుకు సాగుతున్న చాలా మంది చైతన్యజీవులు ప్రేరణ నిచ్చిన గురువు గారిని పోగొట్టుకున్నారు. గుంటూరు జిల్లా అంబాపురంలో పుట్టి పక్కనే వున్న గురజాల లోనూ తర్వాత కర్నూలు హైదరాబాదుల లోనూ చదువు పూర్తి చేసిన కేశవరెడ్డికి తెలుగు కళా సాహిత్యాలతో ప్రజా జీవితంతో ఉపాధ్యాయ ఉద్యమంతో పెనవేసుకుని పెరిగారు. బాల్యంలోనే హరికథలు, బుర్రకథలు, జానపదాలను చూస్తూ కళల పట్ల మక్కువ పెంచు కుని విద్యార్థి దశలోనే మ్యాగజైన్లలో రచనలు చేసిన జిజ్ఞాసువు కేశవరెడ్డి. సూర్యాపేటలో మొదలై తర్వాత చాలా ఊళ్లు తిరిగిన ఆయన ఉపాధ్యాయ జీవితం రేపటి పౌరులను చేరువ చేసింది. తను చదువుకుంటూ వారిని తీర్చిదిద్దుతూ ముందకు సాగింది. ఉపాధ్యాయ ఉద్యమ ప్రభావం కేశవరెడ్డికి ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆయన శాశ్వత చిరునామాగా మారింది.
అక్షర ప్రస్థానం.. అపార అధ్యయనం..
అనేక పరిణామాల మధ్య ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఏర్పడినప్పుడు అగ్ర నాయకులుగా ఎ.వెంకటస్వామి, డి.రామిరెద్డి, పి.వి. సుబ్బరాజు వంటివారు ముందుండేవారు. వీరితో పాటు ఐక్య ఉపాధ్యాయ సంపాదకుడుగా మైనేని వెంకటరత్నం. విజయవాడలో ప్రజాశక్తి కార్యాలయం వెనకే యు.టి.ఎఫ్ భవన్ నిర్మాణం జరిగాక వీరందరినీ నిరంతరం కలుస్తుండేవాళ్లం. గుంటూరు నుంచి దాదాపు వారంలో మూడు నాలుగు సార్లు వచ్చివెళ్లే వారు కేశవరెడ్డి. ఐక్య ఉపాధ్యాయ సంపాదకవర్గ సభ్యులుగా మైనేనికి సహాయపడుతుంటేవారు.దేశదేశాల విద్యావిధానం గురించి వ్యాసాలు రాస్తుండేవారు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా 'నగరం' వెలువడింది. 'అమ్మ' నవలతో ప్రపంచ వ్యాపితంగా ప్రగతిశీల శక్తులకు ఊపిరులూదిని మాగ్జిం గోర్కి నవల 'స్వర్ణ పిశాచి నగరం' ఆ విధంగా కేశవరెడ్డి కలంలో రూపుదిద్దుకుంది. పాత్రలకు పేర్లు, వాతావరణం వీటన్నిటిని మార్చి తెలుగీకరించే ప్రయత్నం చేశారు. ఆ నవలపైన వచ్చిన సమీక్షలు నాకు తన రచనా శక్తిని పరిచయం చేశాయి. మరోవైపున ఈ విధమైన తెలుగీకరణ మంచిదా కాదా అని చర్చ కూడా నడచింది గాని కేశవరెడ్డి తన అభిప్రాయం మార్చుకోలేదు. కాకుంటే మరింత రెండుమూడేళ్ల పాటు ఏకధాటిగా ఇంగ్లీషు తెలుగు సాహిత్యం చదువుతూ అవగాహన పరిపుష్టం చేసుకున్నారు. పట్టు పెంచుకున్నారు. అప్పుడే ప్రజాశక్తి ఆదివారం అనుబంధానికి ధారావాహికలు రాస్తుండేవారు. కాశయ్య ముత్యాలు వాటిలో నాకు బాగా గుర్తుంది. అది కూడా అనుసరణే అయినా జీవద్భాషలో చాలా పట్టుగా నడిచింది. రచన ఇవ్వడమే గాక ఆయన దానిపై స్పందన తెలుసుకోవడానికి ఎంతో తపన పడేవారు. నాలాంటి వారిని పదేపదే ప్రశ్నలు వేసేవారు, పైపై మెచ్చుకోళ్ల కన్నా విషయ ప్రధానమైన విమర్శకు విలువనిచ్చేవారు. అలాంటి చాలా చర్చలు నాకు గుర్తువస్తున్నాయి. చిన్న చిన్న గల్పికల్లాటి వాటితో గొప్ప భావన స్ఫురింపచేసే శక్తి ఆయనకుండేది. విస్తారంగా చదివారు గనక ఒక్క ఊపులోనే చరిత్ర గమనాన్ని కుదిగుచ్చి రాయగలిగేవారు.
ప్రామాణిక గ్రంథ పరంపర
ఇ.ఎం.ఎస్ నంబూద్రిపాద్ స్వాతంత్య్ర పోరాట చరిత్ర బృహద్గ్రంథ అనువాదం కేశవరెడ్డిని చాలామందికి పరిచయం చేసింది. 'మాన్స్ వరల్డ్‌లీ గూడ్స్' అనే సులభతర ఆర్థిక శాస్త్ర గ్రంథాన్ని అనువాదం చేసినప్పుడు 'మానవుడు సంపద సమాజం' అనే పేరు నేనే పెట్టాను. వర్గ సమాజ వాస్తవాలను కళ్లకు కట్టే భూలోకంలో శని మరో ప్రయోగం (మూలం ఆంటన్ టామ్ సార్వే). బిపిన్ చంద్ర, సుమిత్ సర్కార్, కె.కృష్ణా రెడ్డి స్వాతంత్య్ర సమరం పైన భారత దేశ చరిత్రపైన రాసిన గ్రంథాల సీరిస్ అనువాదం పోటీ పరీక్షలకు గొప్ప వనరుగా కొనసాగుతున్నది. కేశవరెడ్డి ఈ కాలంలో అనారోగ్యంతో బాధపడిన కుటుంబ బాధ్యతలు వెన్నాడినా కాస్త వెసులుబాటు కలగగానే ఏదైనా అనువాదం అడిగేవారు. ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా ఆలస్యం లేకుందా అత్యంత బాధ్యతగా చేసి పంపుతుండేవారు. దశాబ్దాలుగా ఎంతో మంది ప్రయత్నించి కూడా తెలుగులో తీసుకురాలేకపోయిన ఎరిక్ హాబ్స్‌వామ్ రచనలు, పీపుల్స్ హిస్టరీ పేరిట ఇర్ఫాన్ హబీబ్ రాసిన చరిత్ర సిరీస్ వీటిని అనువాదం చేయడం ఆయన పట్టుదలకు ప్రతిబింబం.ఇదే కాలంలో విద్యారంగంపై అగాధమైన శ్రమతో రాసిన సమగ్ర గ్రంథాన్ని ఎం.ఎల్.సి కె.స్.లక్ష్మణరావు సహకారంతో గుంటూరులో ప్రచురింపచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అందించిన అణిముత్యాల వంటి అనువాదకులలో అగ్రగణ్యులు కేశవరెడ్డి, తనతో పాటు గుర్తుకువచ్చే మరో పేరు ఎ.జి.యతిరాజులు. అందుకే వీరిద్దరిని పలు సందర్భాల్లో అభినందించేవాళ్లం.
పదేళ్ల పత్రికా బాధ్యత, సకుటుంబంగా సేవ
కేవలం రచనలు అనువాదాల గురించే చెబితే కేశవరెడ్డి జీవిత చిత్రణ పూర్తికాదు. పదవీ విరమణ వరకూ ఆయన ఉపాధ్యాయ బాధ్యతలకు న్యాయం చేసేందుకు ఎంతో శ్రమించేవారు. మరోవంక మైనేని వెంకటరత్నం తర్వాత ఐక్య ఉపాధ్యాయ సంపాదకత్వం చేపట్టి దశాబ్దం పాటు తీసుకువచ్చారు. ఆ కాలంలో సాహిత్యానికి ఇతోధిక ప్రోత్సాహం ఇచ్చారు, స్వయంగా రచయిత గనకే ఏది కావలసినా రాయడానికి కూచునేవారు. సతీమణి హనుమాయమ్మ ఎల్లవేళలా సహకరించి వుండకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇక వారి కుటుంబం మొత్తం ఉద్యమంలో ఉండటం ఎంత విశేషమో చెప్పనవసరం లేదు. తన కృషికి అధ్యయనానికి వారు గొప్ప గౌరవాభిమానాలతో ప్రోత్సాహమిచ్చారు.
సాహితీ స్రవంతితో అనుబంధం
రచనా రంగంలోనూ ఉపాధ్యాయ ఉద్యమం సాహిత్య రంగం మూడింటి లోనూ మా ఇద్దరికి మంచి సాన్నిహిత్యం వుండేది సాహితీ స్రవంతి ఏర్పాటులోనూ విస్తరణ లోనూ కేశవరెడ్డి పాత్ర మరవలేనిది. వాస్తవంగా సంస్థ ఈ పేరుతో ముందుకు రాకముందు 1999లో జరిపిన సాహిత్య తరగతుల లోనే ఆయన ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఓపిక తగ్గినా గుంటూరు, విజయవాడలలో కార్యక్రమాలకు కృషి చేసేవారు. సాహిత్యశాలలు, కార్యశాలలలో చాలాసార్లు అధ్యక్ష స్థానంలో వుండి పెద్దరికంతో నడిపేవారు. సాహితీ స్రవంతి ఉపాధ్యక్ష బాధ్యతలతో సహా పలు విధాల సేవలందించారు. సాహిత్య రంగ విశాల స్వభావం, విమర్శనాత్మక దృక్పథం కూడా ఆయనలో తగుపాళ్లలో వుండేవి, నాయకులతోనూ మంచి సంబంధాలుండేవి. ముఖ్యంగా మోటూరు హనుమంతరావు గారిని కలుసుకోవడానికి తరచూ వస్తుండేవారు. ఎప్పుడు వచ్చినా అరగంటైనా కూచుని మాట్టాడుకోవడం తప్పనిసరి, సమస్యాత్మక అంశాలను సైద్ధాంతిక కోణాలను సున్నితంగా సునిశితంగా చర్చించేవారు. మీడియాలోగాని రాజకీయాలలో గాని ఏదైనా తప్పుగా జరిగినా ఎబ్బెట్టుగా మారినా ఏకపక్షంగా నడిచినా ఆమోదించేవారు కాదు. అప్పటికి ఆచరణలో సర్దుకున్నా అభిప్రాయాలతో రాజీపడేవారు కాదు. స్వతహాగా కొంత మొహమాటస్తులనిపించినా విధానాల విషయంలో దృఢమైన వ్యక్తిత్వం ఆయనది. ఇన్ని మంచి లక్షణాలున్నాయి గనకే ఎనిమిది పదులు వచ్చినా ఎత్తిన జెండా దింకుండా రాసే కలం ఆపకుండా ముందుకే నడిచారు, అధ్యాపకుడుగా అధ్యయన శీలిగా అక్షరాన్వేషిగా అనువాదకుడుగా ఆఖరి వరకూ సేవలందించిన కేశవరెడ్డి వంటి మేధావులు చాలా అరుదుగా వుంటారు. ఆ మేధాశక్తిని మహోన్నతమైన మార్క్సిస్టు ఆశయాల సాధనకు ఉపాధ్యాయ ఉద్యమాభివృద్ధికి ప్రజాశక్తి ప్రచురణాలయానికి సంపూర్ణంగా సమర్పించిన సార్థక జీవితం కేశవరెడ్డిది. 26న ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనకిదే జోహార్లు.
తె.ర










