Dec 18,2022 20:15

సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి - రాయచోటి : ఉపాధ్యాయ బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేసి మరో పక్క ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు నిర్వహిచడం అప్రజాస్వామికమని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్‌, జాబిర్‌ పేర్కొన్నారు. ఆదివారం యుటిఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశం రాయచోటిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తామంటూ జిఒ విడుదల చేసిన ప్రభుత్వం, కొందరు ఉపాధ్యాయుల పైరవీలకు తలొగ్గి కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడుస్తూ దొడ్డిదారిన అక్రమ బదిలీలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. బుధవారం విజయవాడలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖాధికారులు అక్రమ బదిలీలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రహస్య సీల్డ్‌ కవర్లో డిఇఒలకు అందజేయడం శోచనీయమన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీల్లో కేటగిరి 1, 2లలోని కొన్ని స్థానాలను బ్లాక్‌ చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారని, మిగిలిన ఖాళీలను సిఫార్సు బదిలీల ద్వారా భర్తీ చేస్తే మారు మూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యులు మారుమూల ప్రాంతాల్లోనే ఉండి పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. జిఒలో పేర్కొన్న విధంగా బదిలీల సాఫ్ట్‌ వేర్‌ను అభివృద్ధి చేయకుండా ఉపాధ్యాయులను ఇబ్బందులను గురిచేయడం సరైందికాదన్నారు. బదిలీలపై ఉన్న అభ్యంతరాలు,అసంబద్ధాలపై గౌరవ విద్యాశాఖ మంత్రి మరియు విద్యా శాఖ అధికారులతో జరిగిన చర్చల సందఠంగా అంగీకరించన అంశాలపై బదిలీ ధరఖాస్తు గడువు ముగుస్తున్న స్పష్టతనివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. బదిలీ ధరఖాస్తు గడువును మరో రెండు రోజులు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే సిఫార్సు బదిలీలను రద్దు చేసి తమ పారదర్శకతను, చిత్తశుద్ధిని నిరూపించు కోవాలన్నారు. సమావేశంలో యుటిఎఫ్‌ సహాధ్యక్షులు శివారెడ్డి,హేమలత, జిల్లా ట్రెజరర్‌ అక్రం బాషా, జిల్లా కార్యదర్శులు చంద్ర శేఖర్‌, రమణ మూర్తి, శ్రీధర్‌ రెడ్డి, వెంకట సుబ్బయ్య, గోపాల్‌ నాయక్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వెంకట రమణ, కృష్ణారెడ్డి, చెంగల్‌ రాజు, ఆడిట్‌ కమిటీ కన్వీనరు సురేంద్ర రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.