ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతిని పురస్కరించుకొని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంస్థలు సినీ రంగంతో పాటు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని ఎఎన్‌ఆర్ సెంటినరీ పాన్ ఇండియా అవార్డ్స్ పేరిట ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియంలో సత్కరించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శతజయంతి వేడుక పోస్టర్‌ను మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి విజయవాడలో ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న పురందేశ్వరి మాట్లాడుతూ తనకు బాబాయి వంటి మహానటులు అక్కినేని శతజయంతి వేడుకకు ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులకు అందించే ఈ సత్కారం మేధావి అయిన బాబాయికి నిజమైన నివాళి అని అన్నారు. ఎఫ్‌టిపిసి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా, తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు వీస్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ మూల స్తంబాలలో ఒకరైన అక్కినేని శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరోసర్జన్ పువ్వాడ రామకష్ణ, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు పాతూరు నాగభూషణం, డాక్టర్‌రాంచంద్ పాల్గొన్నారు.










