సమావేశంలో మాట్లాడుతున్న పట్టణ కార్యదర్శి నరసింహప్ప
ప్రజాశక్తి-హిందూపురం ఆశావర్కర్లు ఎదు ర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా ఉద్యమిస్తే విజయం తప్పక వరిస్తుందని సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహప్ప తెలిపారు. శుక్రవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జ్యోతమ్మ అధ్యక్షతన ఆశావర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ పటిష్టంగా ఉండాలంటే ప్రతినెలా అందరూ సమావేశం నిర్వహించుకుని సమస్యలపై చర్చించాలన్నారు. ఇలా చేయడం వల్ల ఆశావర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అందరికీ తెలుస్తాయన్నారు. అంతేగాకుండా సమస్యల పరిష్కార మార్గాలను వెతికి పరిష్కరించుకునే వీలుంటుందన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులతోపాటు ఆశావర్కర్ల యూనియన్ నాయకులు మమత, ప్రశాంతి, జేబీనమ్మ, ఆశావర్కర్లు పాల్గొన్నారు.










