ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పలు గుణపాఠాలు నేర్పుతున్నాయి. హెచ్చరికలనూ ఆవిష్కరించాయి. అత్యంత సున్నితమైన, పాకిస్తాన్ సరిహద్దులో గల, పంజాబ్ ఎన్నికలు 'పాంచ్ పటాకా' మొత్తానికే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. సంప్రదాయ పార్టీలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్‌ను పంజాబ్ ప్రజలు తిరస్కరించి ఆప్‌కు ఘన విజయం కట్టబెట్టారు. తన మతతత్వ రాజకీయాలతో పంజాబ్‌లోనూ చిచ్చు రగిలించి లబ్ధి పొందాలనుకున్న బిజెపి కుతంత్రానికి అక్కడి ప్రజలు అత్యంత చైతన్యయుతంగా చావుదెబ్బ కొట్టి దేశానికే ఆదర్శవంతంగా నిలిచారు. ఎన్నికలకు ముంగిట మోడీ ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలు తేవడంపై పంజాబ్ రగిలిపోయింది. కార్పొరేట్ అనుకూల చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు నిర్వహించిన మహత్తర రైతు పోరాటంలో పంజాబ్ రైతులే ముందు పీఠిన నిలిచారు. రైతుల ఆందోళనలతో అకాలీదళ్ ఎన్‌డిఎ నుండి విడగొట్టుకోవాల్సి వచ్చింది. రైతు ఉద్యమం పలు రాష్ట్రాలకు విస్తరిస్తుండటంతో భయపడ్డ మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అనతికాలంలో తనలో తాను కుమ్ములాడుకోవడంతో ప్రజలు ఆ పార్టీని ఊడ్చిపారేశారు. ప్రమాదకర బిజెపిని దరి చేరనీయలేదు. అవకాశవాద అకాలీదళ్‌ను పక్కనపడేశారు. ఆకర్షణీయ పథకాలతో నిజమైన ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చిన ఆప్‌కు జై కొట్టారు. 117 స్థానాలకుగాను 92 ఆప్‌కు కట్టబెట్టారు. నిర్ణయాత్మక మార్పు కోసం ఓటు వేశారు.
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. 403 సీట్లున్న యుపిలో బిజెపికి గతంలో 312 స్థానాలొస్తే ఈసారి 270 వచ్చాయి. సీట్లు తగ్గినప్పటికీ అధికారం కైవసం చేసుకుంది. బిజెపికి ఎస్‌పి గట్టి పోటీ ఇచ్చింది. 47 నుండి 125కు తన బలాన్ని పెంచుకుంది. కాంగ్రెస్, బిఎస్‌పి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. బిజెపిని వ్యతిరేకించే బిఎస్‌పి, కాంగ్రెస్‌కు కలిపి 14 శాతం వరకు ఓట్లొచ్చాయి. ఎంఐఎం కూడా నష్టదాయక పాత్ర నిర్వహించింది. బిజెపి వ్యతిరేక ఓట్లు చీలాయి. ప్రతిపక్షాల మధ్య అనైక్యత బిజెపికి వరంలా మారింది. మరోవైపు కేంద్రంలో ఉన్న అధికారం, ధన ప్రవాహం, ఎన్నికల సంఘం పరోక్ష తోడ్పాటు, కుల, మత సమీకరణలు బిజెపి గెలుపునకు సహాయపడ్డాయి. యోగి ప్రభుత్వ వైఫల్యాలు అన్నీ ఇన్నీ కావు. రైతు ఉద్యమ ప్రభావం, లఖింపూర్ ఖేరీ మారణకాండ, శాంతి భద్రతలు, కరోనా నియంత్రణ వైఫల్యాలు యోగి సర్కారును ముచ్చెమటలు పట్టించాయి. అయినా బిజెపి తేరుకుందంటే అది పక్కాగా అమలు చేసిన 'విభజన' వ్యూహమే హేతువు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ చతికిలపడటం బిజెపికి లాభించింది. అక్కడ బిజెపి మెజార్టీ సీట్లు దక్కించుకోగలిగింది. గోవాలో అతిపెద్ద పార్టీగా, మణిపూర్‌లో స్వల్ప మెజార్టీ బిజెపి తెచ్చుకుంది.
తాజా ఎన్నికల ఫలితాలు దేశంలో మితవాద రాజకీయాల ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయి. కార్పొరేట్- మతతత్వ కూటమి కార్యాచరణను కళ్లకు కడుతున్నాయి.. కేంద్ర బిజెపి పాలనలో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల కారణంగా ధరల పెరుగుదల స్తంభించింది. ఎన్నికలైన వెంటనే ధరల మోత మోగిపోతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రజలకు మరిన్ని కడగండ్లు తప్పవు. కరోనా సమయంలో కేంద్రం ఇచ్చిన ఉచిత రేషన్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి పట్ల ప్రజల్లో కొంత సానుకూలత తెచ్చిపెట్టిందనే అభిప్రాయాలున్నాయి. రాష్ట్రాల హక్కుల హననంపై ప్రాంతీయ పార్టీల్లో బిజెపి పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. బిజెపికి అంటకాగుతున్న, సానుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు పంజాబ్‌ను చూసి నేర్చుకోవాలి. ఈ ఎన్నికలతోనైనా కాంగ్రెస్, తమ పార్టీలో సుదీర్ఘంగా తిష్ట వేసిన గజిబిజి గందరగోళం నుండి బయట పడాలి. మతతత్వం పట్ల రాజీ ధోరణిని విడనాడాలి. అయితే, బిజెపిని ఓడించడం ఎన్నికల ఎత్తుగడలతో మాత్రమే సాధ్యం కాదని, ఆ పార్టీ అనుసరిస్తున్న కార్పొరేట్- హిందుత్వ విధానాలను ప్రతిఘటించి, ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల ముందుంచడం ద్వారానే సాధ్యమన్నది ఈ ఎన్నికల ఫలితాల గుణపాఠం.










