భవనేశ్వర్ : ఆకలి విపరీతంగా అవుతున్నా సెల్‌లో ఏదో ఒకటి చూసుకుంటూ.. ఆ సమయం తప్పించి తింటే ఒక్కపూట భోజనం అయినా మిగులుతుంది కదా అనే ఆలోచనల్లోనే నేటి రోజువారీ కూలీ జీవనం సాగిస్తున్నాడు. సరిగ్గా ఈ కోవకు చెందిన వ్యక్తే ఒడిశా సంబ్పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన వ్యక్తి ఇసాక్ ముండా. ఇతను రోజువారీ కూలీ. లాక్‌డౌన్ సమయంలో పని లేక... అతని దృష్టి ఆకలివైపు మరల్చకుండా ఉండాలనే సెల్‌లో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసేవాడట. అలా అతను వీడియోలు చూస్తూ చూస్తూ... తనే సొంతంగా వీడియోలు తీసి..ఆ వీడియోల ద్వారా యూట్యూబ్ ట్రెండ్‌సెట్టర్‌గా పేరుగాంచాడు. అది కూడా యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోలంటే కేవలం తను రోజువారీగా ఆహారం తినే విధానాన్నే వీడియోతీసి పోస్ట్ చేస్తాడు. తను తినే అన్నము.. కూర వాటికితోడు టమాటా, పచ్చిమిర్చి నంజుకుంటూ బాగా పెద్ద పెద్ద ముద్దలతో ఎంతో స్పీడుగా తినే వీడియోలను పోస్ట్ చేస్తాడు. ఈ వీడియోల్లో అతను ఆహారం తినే విధానాన్ని చూస్తే ఎవరికైనా సరే.. ఆశ్చర్యంతోపాటు.. ఒకింత భయం కూడా వేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలకు దాదాపు ఐదు లక్షలమంది వ్యూయర్స్ ఉన్నారు. దాదాపు ఏడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో పని లేకపోవడం వల్ల వీడియోలు తీయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోతే.. మూడు వేలు అప్పు తీసుకొని ఓ చిన్న స్మార్ట్ ఫోన్ కొని ఆ ఫోన్‌లోనే వీడియోలు చేయడం ప్రారంభించాడట. అతి తక్కువ కాలంలోనే అతను పాపులారిటీ అవ్వడమే కాదు.. ఆర్థికంగానూ నిలదొక్కుకున్నాడు. ఇంత పాపులర్ అయిన ముండాను మీడియా పలకరించగా.. 'నేను కేవలం సంవత్సరం నుంచే వీడియోలు చేస్తున్నాను. తక్కువకాలంలోనే నా వీడియోలను ఎక్కువమంది చూడడం వల్ల నేను పాపులర్ అయ్యాను. దీనికి నేనెంతో సంతోషిష్తున్నాను. దీనివల్ల ఒక్క ఆగస్టు నెలల్లోనే ఐదులక్షల రూపాయలు యూట్యూచ్ ఛానెల్ వాళ్లు నాకు ఇచ్చారు. దీంతో నా ఆర్థిక సమస్యలు తీరడంతోపాటు.. ఓ ఇల్లు కూడా కట్టుకున్నాను. ఇప్పుడు నాకున్న శక్తిమేరకు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను' అని అన్నారు. అయితే ఇలా యూట్యుబ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయి డబ్బు సంపాదించడం తన లక్ష్యం కాదని... తను రోజువారీ కూలీగా పనిచేసుకోవడమే ఎంతో సంతోషమని చెబుతున్నాడు. అలాగే ఇలాంటి వీడియోల ద్వారా వారి స్థానిక సంప్రదాయాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వీడియో మీరూ చూసేయండి : https://youtu.be/lAJI2gq5hVA










