May 30,2022 07:49
  • పారాహూషార్‌ అంటూ 27న ఉత్తర్వులు
  • 29న ఉపసంహరణ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 'ఆధార్‌ సురక్షితం కాదు, దుర్వినియోగానికి గురయ్యే అవకాశముంది. కాబట్టి ఆధార్‌ ఫొటో కాపీని ఏ సంస్థతోనూ పంచుకోకూడదు. ఆధార్‌ ఫొటో కాపీని ఇవ్వడానికి బదులు, ఆధార్‌ నంబర్‌ చివరి నాలుగు అంకెలను మాత్రమే చూపించే మాస్క్‌ ఆధార్‌ను ఉపయోగించండి' అని ఈ నెల 27న జారీ చేసిన 'అడ్వయిజరీ' ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వునకు కేంద్రం కట్టుబడి ఉన్నట్లైతే ఇంతవరకు ఆధార్‌ గురించి తాను చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని మోడీ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఉత్తర్వును ఉపసంహరించుకుంటున్నట్లు కనబడుతోంది. ఈ మొత్తం ఉదంతంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ ఇస్తూ ఈ ఉత్తర్వును తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందునే ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది. నెపాన్నంతటినీ యుఐడిఎఐపైకి నెట్టివేసే యత్నం చేసింది. ఆధార్‌ దుర్వినియోగమవుతుందని తెలిశాక కూడా గ్యాస్‌కు, బ్యాంక్‌ అకౌంట్‌కు, పట్టాదారు పాస్‌ పుస్తకానికి, సంకక్షేమ పథకాలకు ఇలా ప్రతిదానికి ఆధార్‌ను ప్రభుత్వాలు ఎందుకు ముడిపెడుతున్నట్లు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.