Mar 16,2022 06:49

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమిపై బేరీజు వేసుకోవడంలో కాంగ్రెస్‌ పాత డ్రామానే కొనసాగించింది. కాంగ్రెస్‌ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సిడబ్ల్యుసి ఆదివారం నాలుగు గంటల సేపు కూర్చొని అయిదు ఓటములకు సంబంధించిన అసలు కారణాలను చర్చించినట్టులేదు. కాలి కింద నేల కదిలిపోతున్నా కాంగ్రెస్‌ అధినాయకత్వంలో కించిత్‌ కూడా చలనం ఉన్నట్టు కనిపించడం లేదు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ అనుసరించిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, బిజెపి కరడుగట్టిన హిందూత్వను మృదు హిందూత్వతో ఎదుర్కోవాలనే దాని సైద్ధాంతిక దివాలాకోరుతనం, పార్టీలో సంస్థాగత బలహీనతలు వెరసి కాంగ్రెస్‌ దుస్థితికి కారణమయ్యాయి. ఈ లోపాలను గుర్తించి, తగు దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి అది ఎన్నడూ ప్రయత్నించిన పాపాన పోలేదు. ఒక్కొక్క రాష్ట్రం చేజారుతుంటే చేష్టలుడిగినట్లు వ్యవహరిస్తున్నదే తప్ప నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోడానికి ప్రయత్నించడం లేదు. ఇందుకోసం పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక ఏప్రిల్‌లో 'చింతన్‌ శిబిర్‌'ను విడిగా నిర్వహిస్తామని చెప్పింది. 'ఐదు రాష్ట్రాల్లో ఓటమికి, పార్టీ బలహీన పడడానికి గాంధీ కుటుంబమే కారణమని అంటున్నారు. సిడబ్ల్యుసి సభ్యులూ ఇదే అభిప్రాయంతో ఉంటే ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధం' అంటూ సమావేశం ప్రారంభంలో సోనియా చేసిన వ్యాఖ్యలు పార్టీలో అసమ్మతివాదులకు చెక్‌ పెట్టే ఎత్తుగడలో భాగమేనని స్పష్టమవుతున్నది. అప్పటికీ గులాం నబీ అజాద్‌, ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌ వంటివారు పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. అయినా, పట్టించుకోకుండా గాంధీల కుటుంబంపై విశ్వాసం ప్రకటిస్తూ సిడబ్ల్యుసి తీర్మానం చేసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగేవరకు తాత్కాలిక అధ్యక్షులుగా సోనియానే కొనసాగాలని ఆ తీర్మానంలో ఉద్ఘాటించారు. అశోక్‌ గెహ్లాట్‌ వంటి వారు మరో అడుగు ముందుకేసి రాహుల్‌ గాంధీకే పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని కోరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అమ్మను అడ్డం పెట్టుకుని రాహుల్‌, ప్రియాంక ఇద్దరూ పార్టీలో రెండు అధికార కేంద్రాలుగా చక్రం తిప్పుతున్నారు. ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఎప్పుడు అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించినా గాంధీ కుటుంబం నుంచి తప్ప వేరొకరికి అవకాశం లభిస్తుందని అనుకోలేము.
   కాంగ్రెస్‌ సంస్థాగతంగానే కాదు, రాజకీయంగా కూడా ఇదివరకెన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్‌, హిందూత్వ, ప్రజా వ్యతిరేక విధానాలు దేశాన్ని అథోగతి పాల్జేస్తున్నాయి. 16 నెలలుగా రైతాంగం సాగించిన పోరాటం సఫలమైనా, వారి కష్టాలు ఇప్పటికీ తీరలేదు. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి బిజెపి ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. రాష్ట్రాల హక్కులను హరిస్తూ సమాఖ్య వ్యవస్థను గుల్లబారుస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వ ఆస్తులను టోకుగా కార్పొరేట్లకు అమ్మేస్తున్నాయి. బిజెపిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమవుతోంది. కారణం బిజెపికి విధానపరమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ప్రజలు చూడడం లేదు. భారత దేశ బహుళత్వం, లౌకికవాదం, శాంతియుత సహజీవనం, ప్రజాస్వామ్యం బిజెపి పాలనలో ప్రమాదంలో పడ్డాయి. బిజెపి వినాశకర విధానాలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర శక్తులను సమీకరించగలిగే స్థితిలో కాంగ్రెస్‌ లేదు. ఈ వరుస వైఫల్యాలకు ఎవరు జవాబుదారీ? ఎక్కడ లోపం జరిగింది? వంటి అంశాలపై చర్చ లేదు. 2021లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణాలు తెలుసుకునేందుకు ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను చర్చించకుండా అటకెక్కించారు. పార్టీ వైఫల్యాలపై సమగ్రంగా చర్చించకుండా గాంధీల కుటుంబంపై విశ్వాసాన్ని పునరుద్ఘాటించడానికే సిడబ్ల్యుసి సమావేశం పరిమితమయ్యింది. తన విధానాలను సమీక్షించుకుని, సంస్థాగతంగా చక్కదిద్దుకోకపోతే ఉన్నది కూడా నిలబెట్టుకోవడం కష్టసాధ్యమే !