- రబీ ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన
- అంతకంతకూ తగ్గుతోన్న సేకరణ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రబీ ధాన్యం కొనుగోళ్లపై రైతులను అనుమానాలు ముసురుకున్నాయి. ఖరీఫ్‌లో రైతులకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా రబీలోనైనా సజావుగా ప్రభుత్వం రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందా అనే సందేహాలు అన్నదాతల్లో బయలుదే రాయి. నిరుడు రబీ ధాన్యం సేకరణ బాగా తగ్గింది. మొన్న ఖరీఫ్‌లోనూ మునుపటి కంటే సేకరణ లక్ష్యాలను సర్కారు తగ్గించింది. నిర్ణయించిన టార్గెట్ లో సైతం లక్షన్నర టన్నులు సేకరించలేదు. ప్రభుత్వ వ్యవహారం ఈ విధంగా ఉండటంతో రబీ కొనుగోళ్లపై సందేహాలు కలుగుతున్నాయి.
కాగా వారం రోజుల్లో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్‌బికెలు, ఇ-క్రాప్, ముందస్తు రిజిస్ట్రే షన్ల పాటే పాడింది. ఎంత పరిమాణంలో రబీ ధాన్యం సేకరిస్తారో స్పష్టంగా టార్గెట్ పేర్కొనలేదు. దాంతో రబీ కొనుగోళ్లపై రైతులు ఆందోళనగా ఉన్నారు.
సాగు తక్కువే
రబీలో వరి సాధారణ సాగు 19.72 లక్షల ఎకరాలుకాగా ఈ మారు 16.4 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. సర్కారు మాత్రం మూడవ ముందస్తు అంచనాల్లో 19.52 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని ఆశించింది. 54.23 లక్షల టన్నుల దిగుబడొస్తుందని పేర్కొంది. ఉత్పాదకత ఎకరాకు సగటున 37 బస్తాల (75 కిలోల బస్తా) వడ్లు లభిస్తాయంది. మరోవైపు వ్యవసాయశాఖ గణాంకాల్లో సాగు 16.4 లక్షల ఎకరాలే. మూడు లక్షల ఎకరాల్లో సాగు తగ్గినందున, ఆ మేరకు 8 లక్షల టన్నుల దగుబడి తగ్గుతుంది. అకాల వర్షాల నష్టాలు ఉండనే ఉన్నాయి. ఏతావాతా 46 లక్షల టన్నుల ఉత్పత్తి లభించే అవకాశం ఉంది. గతేడాది తుది అంచనాల్లో 51.57 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. కాగా ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 3 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. లక్ష ఎకరాలకంటే ఎక్కువ పశ్చిమగోదావరి జిల్లాలో 2.15 లక్షల ఎకరాలు, తిరుపతి 1.88 లక్షల ఎకరాలు, కోనసీమ 1.73 లక్షల ఎకరాలు, కాకినాడ 1.63 లక్షల ఎకరాలు, తూర్పుగోదావరి 1.37 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
తగ్గుతోన్న సేకరణ
రబీ ధాన్యం సేకరణ అంతకంతకూ తగ్గుతోంది. కరోనా సంవత్సరాలైన 2019-20లో 34.73 లక్షల టన్నులు, 2020-21లో 37.24 లక్షల టన్నులు సేకరించారు. నిరుడు 2021-22లో 26.25 లక్షల టన్నులే సేకరించారు. ఆ సంవత్సరం జరిగిన ఉత్పత్తిలో 51 శాతం సేకరించారు. 25 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులకే వదిలిపెట్టారు. ఈ తడవ ఏ మేరకు సేకరిస్తారోనన్న ప్రశ్నలొస్తున్నాయి. ధాన్యం ఇచ్చిన రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. తేమశాతం, ఇ-క్రాప్, ముందస్తు రిజిస్ట్రేషన్లు, మిల్లర్ల కొర్రీలు, గోనెసంచుల కొరత, రవాణా, హమాలీ ఛార్జీల వంటి సమస్యలతో రైతులు నానా ఇబ్బందులూ ఎదుర్కొన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ కేంద్రాల్లోకి ప్రవేశం లేదు. ఇటువంటి బాధలు పడలేక వచ్చినకాడికి రైతులు తెగనమ్ముకున్నారు. ఈసారైనా ఆ సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు.











