Oct 10,2023 21:45

- దిగుమతి సుంకాన్ని తగ్గించి పొట్టకొట్టారు
- మద్దతు ధర జిఒ ఇచ్చిన తరువాతే జిల్లా పర్యటనకు సిఎం రావాలి
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి:కేంద్ర ప్రభుత్వం జీడిపిక్కలపై దిగుమతి సుంకాన్ని ఐదు నుంచి 2.5 శాతానికి తగ్గించి దేశీయ జీడి రైతుల నడ్డి విరిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. జీడికి గిట్టుబాటు ధర, జీడి పంట సమగ్రాభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లా పలాసలోని టికెఆర్‌ కల్యాణ మండపంలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వి.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గని మాట్లాడారు. దిగుమతి సుంకం తగ్గించడంతో ఇండోనేషియా, వియత్నాం తదితర దేశాల నుంచి భారీగా జీడి పిక్కల దిగుమతులు వచ్చి పడుతున్నాయన్నారు. బహుళజాతి కంపెనీలకు జీడి రైతుల ప్రయోజనాలను బలిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. బిజెపి సర్కారుకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే దిగుమతి సుంకాన్ని పెంచి ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం జీడి పంట అభివృద్ధికి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి బోర్డు ఏర్పాటు చేసిందని చెప్పారు. జీడి పిక్కల మార్కెటింగ్‌ కోసం రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. జీడి కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వమేనని వివరించారు. ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు జీడి పరిశ్రమ అభివృద్ధికి బోర్డులు ఏర్పాటు చేశాయని, రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించడంతో పాటు ఇాక్రాప్‌ బుక్‌ చేసి పరిహారం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. జీడి పిక్కలకు మద్దతు ధర, కొనుగోళ్లపై జిఒ ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రావాలన్నారు.
ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 16 రకాల పంటలకు, రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించినా అందులో జీడి పంటకు చోటు కల్పించకపోవడం జీడి రైతులపై నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. జీడి పప్పుకు ఎక్కువ ధర పలుకుతున్నా, పిక్కలకు ఆ మేరకు ధర రాకపోవడం వ్యాపారుల మాయాజాలమని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడం, ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. 80 కిలోల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతోపాటు జీడి కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అధ్యక్షతన సదస్సులో వామపక్ష పార్టీల నాయకులు చాపర వేణుగోపాల్‌, తామాడ సన్యాసిరావు, వంకల మాధవరావు, జీడి రైతులు, కార్మికులు పాల్గన్నారు.

  • 99 శాతం సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న జగన్‌

రాష్ట్ర సంపదను 99 శాతం అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు దోచిపెట్టడమే జగన్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాధించిన విజయమని శ్రీనివాసరావు విమర్శించారు. వైసిపి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని, సిపిఎస్‌ రద్దు చేస్తామన్న హామీనీ నిలబెట్టుకోలేదన్నారు. బిసిలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి నిధులు కేటాయించలేదని, ఎస్‌సి సబ్‌ప్లాన్‌కూ నిధులు ఇవ్వలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదన్నారు. 99 శాతం హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్తున్నారని, రాష్ట్రంలో సమస్యలతో బాధపడుతున్న ప్రజలంతా మిగిలిన ఆ ఒక్క శాతంలోనే ఉన్నారని తెలిపారు. వారే వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడిస్తారని అన్నారు.