ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :పరీక్ష పత్రాల లీక్‌లకు పాల్పడటం నీచమైన పని, విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటే వారిని దేవుడు కూడా క్షమించడని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ కోణంలో ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణాలో పదో తరగతి పరీక్ష పేపరు లీకేజీ వ్యవహారంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో పది పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని, గత ఏడాది మాస్ కాపీయింగ్‌కు సహకరించిన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. విజయనగరంలోని ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్‌లో దండిమార్చ్ ఐకాన్ విగ్రహాలు ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను విశాఖపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసింది, ప్రారంభించింది తమ హయాంలోనేనన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తమ ప్రభుత్వమేనని, టిడిపి హయాంలో చేసిందేమీ లేదని విమర్శించారు. రుషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుందే తప్ప ఎవరి సొంత భవనాలు కాదని వివరించారు. టిడిపి మాదిరిగా దోపిడీదార్లు, దళారీ వ్యవస్థ తమ పార్టీలో లేదన్నారు. చంద్రబాబు మాయమాటలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారని అన్నారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










