Oct 10,2023 21:53

- చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్‌ ములాఖత్‌
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :కృష్ణా జలాల కేటాయింపులపై పోరాడాలని చంద్రబాబు సూచించారని పిఎసి కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణిలతో కలిసి కేశవ్‌ మంగళవారం ములాఖత్‌ అయ్యారు. అనంతరం జైలు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. జైలులో చంద్రబాబును చూడగానే బాధేసిందన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించడం కళ్లారా చూశానని తెలిపారు. చంద్రబాబును కలిసిన వెంటనే కృష్ణా జలాల అంశంపై ఆయన ఆరా తీశారన్నారు. కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపుల పున:సమీక్ష అంశంపై పార్టీ తరుఫున గట్టిగా పోరాడాలని సూచించారన్నారు. చంద్రబాబు నిరంతరం రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని తెలిపారు. ప్రత్యర్థులు ఆయనను జైలులో పెట్టి రాజకీయంగా, మానసికంగా దెబ్బకొట్టాలని చూసినా మానసికంగా మరింత బలంగా తయారయ్యారని చెప్పారు. 'వై ఎపి నీడ్స్‌ జగన్‌' అని ప్రచారం మొదలు పెట్టారని.... ప్రజలు కూడా 'వై' అనే అడుగుతున్నారని అన్నారు. పోలవరాన్ని ముంచినందుకు, జాబ్‌ కేలండర్‌ ఇవ్వనందుకు, రైతులను మట్టిలో కలిపినందుకు, సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందుకు వై ఎపి నీడ్స్‌ జగన్‌ అంటున్నారా? అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌పైనా మానసిక దాడి చేసేందుకు వైసిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జైలులో చంద్రబాబు భద్రతపై చర్యలు తీసుకోవాలని, దీనిపై కేంద్రాన్ని, న్యాయస్థానాన్ని కోరుతామని చెప్పారు. ఆయన వెంట మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు ఉన్నారు.