Jun 06,2023 23:50
  • నేటినుంచి ఆస్ట్రేలియాతో డబ్ల్యుటిసి ఫైనల్‌ మ్యాచ్‌
  • మ. 3.00గం||ల నుంచి

లండన్‌: వరుసగా రెండోసారి డబ్ల్యుటిసి ఫైనల్లోకి దూసుకొచ్చిన భారతజట్టు మరోసారి టైటిల్‌కై ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఐసిసి టైటిల్‌కు చేజిక్కించుకొనేందుకు మరోసారి రోహిత్‌ సేనకు సువర్ణావకాశం లభించింది. భారతజట్టు చివరిసారిగా 10ఏళ్ల క్రితం ఓ ఐసిసి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారత బ్యాటర్స్‌ కదం తొక్కితేనే అది సాధ్యం కానుంది. సౌథాంప్టన్‌ వేదికగా 2021 ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్‌ చేతిలో 8వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ టెస్ట్‌కు విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, పుజారా, రహానే, రోహిత్‌, జడేజా వంటి బ్యాటర్స్‌తో భారతజట్టు పటిష్టంగా ఉంది. ఛటేశ్వర పుజారా ఇంగ్లండ్‌ కౌంటీల్లో మూడు సెంచరీలు కొట్టి దుర్భేధ్య ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసిరానుంది. ఇంగ్లండ్‌ పర్యటనలో పుజారా 249 పరుగులతో రాణించాడు. ఇక భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాపై విరాట్‌ కోహ్లి 186పరుగుల అత్యధిక స్కోర్‌తో కదం తొక్కాడు. వికెట్‌ కీపర్ల కోటాలో కేఎస్‌ భరత్‌ ముందువరుసలో ఉండగా.. ఇషాన్‌ కిషాన్‌కు చోటు కల్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆస్ట్రేలియా బ్యాటర్స్‌ను కట్టడి చేయాలంటే స్పిన్నర్లు రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌లు రాణిస్తేనే అది సాధ్యం కానుంది.
ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే.. డేవిడ్‌ వార్నర్‌ త్వరలో టెస్ట్‌లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించిన నేఫథ్యంలో అతడు చివరి డబ్ల్యుటిసి ఫైనల్లో బ్యాట్‌ ఝుళింపించే అవకాశముంది. ఐసిసి టెస్ట్‌ బ్యాటర్స్‌ జాబితాలో 2, 3 స్థానాల్లో ఉన్న లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌లతో ఆ జట్టు పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో బోలండ్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతడు చివరి 7టెస్టుల్లో 28వికెట్లు తీసాడు.

  • ఫలితం తేలకుంటే ఆరోరోజుకు...

ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఐదు రోజుల్లో ఫలితం తేలాల్సి ఉంటుంది. ఫలితం రానిపక్షంలో ఆ టెస్ట్‌ డ్రా ప్రకటిస్తారు. కానీ డబ్ల్యుటిసి ఫైనల్లో ఫలితం కోసం మ్యాచ్‌ను 6వ రోజుకు పొడిగించనున్నారు. ఆరవ రోజు కూడా ఫలితం రాని పక్షంలో ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.

  • ప్రైజ్‌ మనీ..

డబ్ల్యుటిసి ఫైనల్‌ టైటిల్‌ నెగ్గిన జట్టు ఐసిసి రూ.13కోట్ల రూపాయల ప్రైజ్‌ మనీని అందజేయనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.6.5కోట్ల ప్రైజ్‌ మనీ దక్కనుంది.
జట్లు..
భారత్‌:
రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, పుజరా, కోహ్లి, రహానే, భరత్‌, అశ్విన్‌, జడేజా, అక్షర్‌, శార్దూల్‌, షమీ, సిరాజ్‌, ఉమేశ్‌, ఉనాద్కట్‌, ఇషాన్‌ కిషన్‌.
ఆస్ట్రేలియా: పాట్‌ కమిన్స్‌(కెప్టెQన్‌), బోలాండ్‌, క్యారీ, గ్రీన్‌, హర్రీస్‌, హేజిల్‌వుడ్‌, హెడ్‌, ఖవాజా, లబూషేన్‌, లియాన్‌, ఇంగ్లిస్‌, మర్ఫీ, స్మిత్‌, స్టార్క్‌, వార్నర్‌.