Sep 30,2023 12:26

 

  • అంతటా అనూహ్య స్పందన
  • 11వ రోజుకు ఉక్కు రక్షణ యాత్ర

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో, విలేకరుల బృందం : సిపిఎం ఉక్కు రక్షణ యాత్రకు అడుగడుగునా ఆదరణ లభిస్తోంది. అన్ని తరగతుల నుంచీ అనూహ్య స్పందన వస్తోంది. గత నెల 20న విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై ఉత్తరాంధ్ర అంతటా సాగిన ఉక్కు రక్షణ యాత్ర 11వ రోజుకు చేరింది. శనివారం ఈ యాత్ర అక్కయ్యపాలెం, ఎఎస్‌ఆర్‌.నగర్‌, గురుద్వారా, సీతంపేట, బివికె సెంటర్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎవిఎన్‌ కళాశాల, కోడి పందాలవీధి, పూర్ణామార్కెట్‌, సిరిపురం, సత్యం జంక్షన్‌, సీతమ్మధార, హెచ్‌బి కాలనీ, కృష్ణా కాలేజీ, ఇసుకతోట, వెంకోజీపాలెం, ఎంవిపి.కాలనీ, ఉషోదయ, పెదవాల్తేరు, సిబిఐ జంక్షన్ల మీదుగా మద్దిలపాలెంలోని సిపిఎం కార్యాలయం వరకూ సాగింది. పలుచోట్ల జరిగిన సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నేతల ప్రసంగాలు వారిలో చైతన్యం నింపాయి. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదం హోరెత్తింది. యాత్ర కొనసాగిన ప్రతిచోటా జనం నుంచి పూలవర్షం కురిసింది. సిపిఎం చేస్తున్న పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు. పలుచోట్ల జరిగిన సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ 'ఉత్తరాంధ్రలో అన్ని చోట్లా మమ్మల్ని కన్నబిడ్డల్లా ప్రజలు చూసుకున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపారు' అని వివరించారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయడంలేదని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్‌.నరసింహారావు ప్రకటించడం కాదని, ప్రధాని మోడీ, కేంద్ర క్యాబినెట్‌ ప్రకటించాలని, అప్పుడే తాము విశ్వసిస్తామని తెలిపారు. ప్రజల నుంచి ఉక్కు పోరాటానికి అనూహ్య స్పందన లభిస్తుండడంతో వారిని పక్కదోవ పట్టించడానికి జివిఎల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఉక్కు ఉత్పత్తిని మోడీ సర్కారు అడ్డుకుంటోందని, ఏదో ఒక విధంగా స్టీల్‌ప్లాంట్‌ను బలహీనపరిచి, అమ్మివేయాలని చూస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేనలు మోడీ భజన చేస్తున్నాయే తప్ప ప్లాంట్‌ రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని విమర్శించారు. ఆయా సభల్లో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్‌ బి.గంగారావు, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, బి.జగన్‌, నగర నాయకులు యుఎస్‌ఎన్‌.రాజు, వి.కృష్ణారావు, డాక్టర్‌ జి.ప్రియాంక, పి.మణి పాల్గన్నారు.