Sep 28,2023 14:40

హైదరాబాద్‌ : విపక్ష ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్ధకమేనని, రేపు ఈ కూటమి ఉరంటుందో లేదో గ్యారంటీ లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆపై పార్లమెంట్‌ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటు సమస్యలు ముందుకొస్తాయని అటు తర్వాత పరిస్ధితి వేరుగా ఉంటుందని విపక్ష కూటమిని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు.పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కూడా పరిస్ధితి మారుతుందని అన్నారు. చారిత్రకంగా దేశంలో ఎన్నికలకు ముందు కూటములు పెద్దగా విజయవంతమైన దాఖలాలు లేవని కవిత చెప్పారు. అందుకే తాము వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తామని, ఏమైనా బీఆర్‌ఎస్‌ జాతీయ అజెండాతో పనిచేసే జాతీయ పార్టీ అని స్పష్టం చేశారు.
కర్నాటకలో ఓ అజెండా, తెలంగాణాలో మరో అజెండాతో ముందుకొచ్చే కాంగ్రెస్‌ మాదిరి బీఆర్‌ఎస్‌ వ్యవహరించబోదని అన్నారు. గత పదేండ్లలో తెలంగాణకు ఎలాంటి మేలు చేయని బీజేపీకి తెలంగాణలో కర్నాటక తరహా ఫలితాలే వస్తాయని స్పష్టం చేశారు. ఏ పార్టీ ఈ ప్రాంత సమస్యలను లేవనెత్తుతుందనేది ప్రజలు గమనిస్తున్నారని ఫలితాలు కూడా అలాగే ఉంటాయని చెప్పారు.