- ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) డిమాండ్
- ఐసిడిఎస్ డైరెక్టర్‌కు వినతి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఐసిడిఎస్ డైరెక్టర్‌కు ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ సోమవారం ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. తెలంగాణా కన్నా అదనంగా అంగన్‌వాడీల వేతనం పెంచాలని కోరారు. అంగన్‌వాడీలకు తెలంగాణా రాష్ట్రంలో ఇచ్చిన దానికన్నా అదనంగా వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని, వెంటనే ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తెలంగాణాలో 2021 జులై నుంచి వర్కర్లకు రూ.13,500, హెల్పర్లు, మినీవర్కర్లకు రూ.7,800 ఇస్తున్నారని తెలిపారు. ఎపిలో పెరగలేదని వివరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు రూ.65 ఏళ్లకు పెంచిందని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ అంగన్‌వాడీ వర్కర్లు హెల్పర్లు, మినీ వర్కర్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న డిఎ బిల్లులు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారింట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రమోషన్లలో రాజకీయం జోక్యం తగ్గించాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ పేరుతో ఫుడ్ కమిషనర్, ఎంఎస్‌కె, ఎంఆర్‌ఒ, ఎండిఒ, రాజకీయ నాయకులు అవమానిస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రాజెక్టులో హనుమాయమ్మను రాజకీయ కక్షతో నిర్ధాక్షిణ్యంగా చంపారని, కనీసం మట్టి ఖర్చులు కూడా ఇచ్చే దిక్కులేదని పేర్కొన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని, ప్రీస్కూల్ విద్యార్థులకు యూనిఫాం సరఫరా చేయాలని కోరారు.










