Jul 03,2022 10:28

అల్లూరి సీతారామరాజు విశాఖ మన్యంలో నడిపిన ఉద్యమం గిరిజన తిరుగుబాటు ఉద్యమం. బ్రిటీష్‌ పాలకులు భారతదేశంలోని అడవులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అడవిలోకి కట్టె పుల్లల కోసం వెళ్ళినా.. పశువులను మేపుకోవడానికి వెళ్లినా గిరిజనులను వేధించేవారు. బ్రిటీష్‌ వారు గిరిజనులపై జరిమానాలు వేసేవారు. జైల్లో పెట్టేవారు. బ్రిటీష్‌ వారి వేధింపులు భరించరానివిగా వుండేవి. బ్రిటీష్‌ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గిరిజనులకు పిలుపునిచ్చారు. అడవిపై హక్కు గిరిజనులదే అని చాటిచెప్పారు. విదేశాల నుంచి వచ్చిన బ్రిటీష్‌ వారిని తరిమికొట్టాలనే అల్లూరి సీతారామరాజు పిలుపు గిరిజనుల ప్రాణాలను సైతం తృణప్రాయంగా తెగించడానికి కూడా సిద్ధపరిచింది. అడవిపై గిరిజనులకే హక్కు వుండాలి అనే నినాదం నేటికీ నెరవేరలేదు. బ్రిటీష్‌ వారు గిరిజనులను దౌర్జన్యంగా అణిచి, అడవిపై హక్కులు లాక్కొన్నారు. నేటి పాలకవర్గం అనేక మోసపూరిత పద్ధతుల్లో గిరిజనులను మోసగిస్తూనే ఉంది. బిజెపి ప్రభుత్వం నేడు ద్రౌపది ముర్ము లాంటి వారిని చూపించి, గిరిజన ప్రాంతాల్లోని గనులు, ఖనిజాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నది.
అడవిని రక్షించేది గిరిజనులే..
అడవిని రక్షించేది నాటి నుంచి నేటి వరకు గిరిజనులే. అడవిని భక్షించేది పాలకవర్గమే. విశాఖలోని మంప పోరాటం, శ్రీకాకుళం జిల్లాలోని మందస పోరాటం లాంటివి అడవిపై గిరిజనులు హక్కులు సాధించే దానికి బ్రిటీష్‌ పాలకులపై జరిగిన తిరుగుబాట్లలో భాగమే. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తులను పోగుచేసుకునే హక్కులను బ్రిటీష్‌ వారు నిషేధించారు. అయినా గిరిజనులు తమ శ్రమతో అటవీ ఉత్పత్తులను పోగుచేసుకునే హక్కు వుందని పోరాడారు. అడవిపై గిరిజనులకే హక్కు వుండాలనే నినాదంతో సీతారామరాజు గిరిజనులకు కల్పించిన స్ఫూర్తి అపూర్వం. ఐక్యపరిచి, ఆయన ఆ పోరాటం నడిపారు. ఈ పోరాటం చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం ప్రాంతాలకే పరిమితమైనా సీతారామరాజు అడవిపై హక్కు గిరిజనులదే అనే పిలుపు దేశవ్యాప్తంగానే గిరిజనులను పోరాటపథంలో నడిపించింది. అదే కాలంలో కమ్యూనిస్టు పార్టీలు దేశంలో బీజరూపంలో ఏర్పడినా మహారాష్ట్రలో గోదావరి పర్లేకర్‌ నాయకత్వంలో 'వర్లీ' పోరాటం, బెంగాల్‌లో 'తెబాగ' పోరాటం కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో సాగినవే!
బ్రిటీష్‌ కాలంలో గిరిజనులు తెగల విబేధాలతో చీలిపోయి వున్నారు. సీతారామరాజు నాయకత్వంలోని ఉద్యమం నడిపిన ప్రాంతంలో కొండదొర, భగత, వాల్మీకి, కోయ, కొండరెడ్డి, పిటిజి మొదలగు తెగలుగా అనైక్యతతో వుండేవారు. వారిని ఐక్యం చేయడంలో అల్లూరి కీలకపాత్ర వహించారు. గిరిజనుల అనైక్యతే బ్రిటీష్‌ వారికి వరంగా వుండేది. బ్రిటీష్‌ వారే ప్రధాన శత్రువుగా గిరిజనులంతా గుర్తించాలని అల్లూరి వారిలో ఐక్యతను నూరిపోశారు. గిరిజన తెగల ప్రజలంతా అల్లూరి నాయకత్వంలో ఒక్కటయ్యారు. ఈ ఐక్యతతో బ్రిటీష్‌ వారి గుండెల్లో రైళ్లుపరుగెత్తాయి. గిరిజనులు తమ సంప్రదాయ ఆయుధాలైనా బాణాలు, విల్లంబులతోటే బ్రిటీష్‌ వారిని ఖంగు తినిపించారు. బ్రిటీష్‌ వారు ఏజెన్సీ ప్రాంతంలో మన్యం తిరుగుబాటను అణచడానికి ప్రత్యేకంగా రోడ్లు వేయించారు. టెలిఫోన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున ప్రత్యేక సైన్యాలను మోహరించారు. అల్లూరి నాయకత్వంలో బ్రిటీష్‌ పాలకుల పోలీస్‌స్టేషన్లపై దాడిచేసి, గిరిజనులు సంపాదించిన ఆయుధాలతోనే బ్రిటీష్‌ వారిని ఎదిరించడంలో వారి ఐక్యతే కీలకం. గిరిజన తెగల మధ్య వివాహాలను అల్లూరి ప్రోత్సహించారు. కులాలు, తెగలు మనం కల్పించుకున్నవేనని, మానవుల రక్తమంతా ఒక్కటేనని అల్లూరి బోధించారు. ఆయన స్వయంగా గిరిజనుల ఇళ్లకు వెళ్లి, వారితో కలిసి భోజనం చేసేవారు. వివక్షకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కష్టజీవుందరినీ ఐక్యం చేసేది కమ్యూనిస్టుల ఆశయం. అత్యంత దోపిడీకి గురౌతున్న గిరిజనులను నాటికీ నేటికీ ఐక్యపరుస్తున్నది కమ్యూనిస్టులే. గిరిజనులను తెగల వారీగా చీల్చిన నాటి బ్రిటీష్‌వారు, నేటి పాలకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. గిరిజన తెగలందరినీ ఐక్యపరిచిన మన్యం పోరాటయోధుడు అల్లూరికి, కమ్యూనిస్టు విధానాలకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది.
నాడు-నేడు అవే పోరాటాలు..
బ్రిటీష్‌ పాలకులు గిరిజనులను కట్టుబానిసలుగా పనులు చేయించుకునేవారు. బ్రిటీష్‌ వారు చింతపల్లి ఘాట్‌రోడ్‌ గిరిజనుల శ్రమతో నిర్మించిందే. ఏజెన్సీలో అనేక రోడ్లు బ్రిటీష్‌ వారు నిర్మించారు. కానీ గిరిజనులకు కూలీ ఇవ్వకుండా బ్రిటీష్‌ కాంట్రాక్టర్లు ఎగ్గొట్టేవారు. కూలీ అడిగితే దౌర్జన్యాలు చేసేవారు. గిరిజనులు వెట్టిచాకిరీ చేయరాదని, కాంట్రాక్టర్లు గిరిజనులకు కూలీ చెల్లించాల్సిందేనని అల్లూరి తిరుగుబాటు చేయించారు. నాటికీ నేటికీ దేశవ్యాప్తంగా కూలీ పోరాటాలు సాగుతూనే వున్నాయి. పాలకవర్గం కూలీలను దోచుకుంటూనే వున్నారు. కూలీల పక్షాన నిలబడి పోరాడేవారు కమ్యూనిస్టులు. కూలీలను దోచుకునేవారు పాలకవర్గం. అందుకే అల్లూరి నిర్వహించిన గిరిజన కూలీ పోరాటాలకు, నేటి కమ్యూనిస్టుల కూలీ పోరాటాలకు దగ్గర సంబంధాలున్నాయి. దళితులు, ఆదివాసులకు మద్దతుగా ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను నేటి పాలకవర్గం ఒక్క పద్ధతి ప్రకారం తొలగిస్తున్నది. గిరిజన సబ్‌ప్లాన్స్‌ ఎక్కడా అమలుకావడం లేదు. అన్నింటికంటే భారత రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను తొలగించాలని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలుసు. దేశ స్వాతంత్య్రం తర్వాత దేశంలో అన్ని రంగాల్లో ప్రభుత్వరంగం ద్వారా స్వయం సమృద్ధిని సాధించిన భారీ పరిశ్రమలను కార్పొరేట్లకు బిజెపి నేడు అప్పగిస్తున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లాంటి భారీ పరిశ్రమలను ప్రైవేట్‌, కార్పొరేట్లకు కట్టబెట్టడం వల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని 4,500 మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు రోడ్డునపడే ప్రమాదం ఉంది. రిజర్వేషన్ల అమలుకోసం, సామాజిక న్యాయం నికరంగా పోరాడేది కమ్యూనిస్టులే. దేశాధ్యక్ష పదవిని గిరిజనులకు కట్టబెట్టామనే పేరుతో గిరిజనులను తడిగుడ్డతో గొంతులు కోయడానికి బిజెపి సిద్ధపడుతున్నది. గిరిజన ప్రాంతాల్లోని గనులు, ఖనిజాలు వున్న ప్రాంతాల నుంచి వారిని గెంటేస్తోంది. అటవీహక్కు చట్టం వున్నా పట్టాలు ఇవ్వడం లేదు. బిజెపి మోసాన్ని పసిగట్టలేకపోతే గిరిజనులకు, దేశ ప్రజలకు కూడా తీవ్ర నష్టం కలుగుతుంది.
అల్లూరి సీతారామరాజు బ్రిటీష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన మహాయోధుడు. గిరిజనులను ఐక్యపరిచి, అడవిపై వారి హక్కుల కోసం పోరాడిన త్యాగధనుడు. గిరిజన తెగలను ఐక్యపరిచిన నాయకుడు. ఆదివాసీల వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా గిరిజన పోరాటాలు నడిపారు. దీనికి పూర్తి భిన్నంగాను, కార్పొరేట్లకు అనుకూలంగాను నేటి ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి విధానాలు సాగుతున్నాయి. సీతారామరాజు నాడు పోరాడిన విధానాలన్నింటికీ అనుగుణంగా పనిచేస్తున్నది నేటి కమ్యూనిస్టులే. అందుకే అల్లూరికి అసలుసిసలు వారసులు వారు మాత్రమే.

- సిహెచ్‌ నరసింగరావు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు