విశాఖ ఏజెన్సీలో 2000 సంవత్సరం నుంచి బాక్సైట్ వ్యతిరేక ఉద్యమం, 1/70 చట్టం పరిరక్షణ పోరాటాలకు అంకురార్పణ జరిగింది. విశాఖ కొండల్లో బాక్సైట్‌ను వెలికితీయాలని 1999లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఆటంకంగా వున్న 1/70 చట్టాన్ని సవరణకు సిద్ధపడింది. ఈ కుతంత్రాలను సిపిఎం, గిరిజన సంఘం బయటపెట్టాయి. 1/70 చట్టాన్ని సవరిస్తే వచ్చే నష్టాలు, బాక్సైట్ తవ్వితే జరగబోయే కష్టాలను గిరిజనులకు వివరించాయి. బాక్సైట్ తవ్వకాలకు టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ప్రతి ప్రయత్నాలన్నింటినీ అడ్డుకున్నాయి. నిర్బంధాలను తట్టుకున్నాయి. సిపిఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. జైళ్లకు పంపించారు. అయినా భయపడకుండా ముందుండి నడిచి, గిరిజనులను నడిపించాయి. నేటి వైసిపి ప్రభుత్వ ఊగిసలాటలను ఎండగడుతున్నాయి. బాక్సైట్ ఒప్పందాలు, జిఒ నెంబరు 97 రద్దు చేసే వరకు ఉద్యమించాయి.
ప్రజాభిప్రాయసేకరణతో ఆరంభమైన బాక్సైట్ వ్యతిరేక పోరాటం గ్రామగ్రామాన వ్యాపించింది. బాక్సైట్ తవ్వకాల అంశం ప్రభుత్వాలు ముందుకు తెచ్చిన ప్రతిసారీ పార్టీలకు అతీతంగా గిరిజనులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రతిఘటించేలా వారిలో సిపిఎం, గిరిజన సంఘం చైతన్యం తెచ్చాయి. 2011 డిసెంబరు 21, 22న రోడ్డు మార్గంలో బాక్సైట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నియమించిన కలా కమిటీ పర్యటించకుండా రెండ్రోజులు ఏజెన్సీ బంద్ నిర్వహించారు. విల్లుంబులు చేతబట్టి రాత్రి, పగలూ కొండలపై కాపలా కాసి హెలికాప్టర్లో కమిటీ రాకుండా అడ్డుకున్నారు. గిరిజనుల ఆకాంక్షలను గౌరవించిన కలా కమిటీ... బాక్సైట్ తవ్వకాల అనుమతుల్లో జరిగిన చట్ట ఉల్లంఘలను ప్రభుత్వానికి నివేదించింది. తమ అధికారాలను ఉపయోగించి బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తే... పట్టుదలతో గిరిజనులు పోరాడి బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేయించగలిగారు.
బాక్సైట్ ఒక్కటే కాదు... ఆదివాసీల బతుకులను ప్రభావితం చేసే మైనింగ్ తవ్వకాల అనుమతులన్నింటినీ రద్దు చేయాలని గిరిజనులను కూడగట్టి సిపిఎం, గిరిజన సంఘం పోరాటాలు నడుపుతున్నాయి. 2011 మే 11న డుంబ్రిగుడ మండలం కండ్రూం పంచాయతీలో చైనాక్లే తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులను గిరిజనులు పరిగెత్తించారు. 1/70 చట్టాన్ని పరిరక్షించాలని 2008లో అరకులో పెద్ద పోరాటం జరిగింది. అక్రమ కట్టడాలపై అధికారులు మౌనం వీడేలా ప్రత్యక్ష కార్యాచరణకు కార్యకర్తలు దిగారు. పది అక్రమ కట్టడాలు కూల్చారు. గిరిజనేతర పెత్తందార్ల దాడులు, అక్రమ పోలీసు కేసులు నిరసిస్తూ బంద్‌కు సిపిఎం పిలుపునిస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాస్‌లీవ్ పెట్టి బంద్‌లో పాల్గొన్నారు. విద్యార్థులు తరగతుల బహిష్కరించారు. రైలుట్రాక్‌పై పడుకొని రైళ్లను నిలిపివేశారు. దీంతో అధికారయంత్రాంగం దిగివచ్చింది. సబ్ కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు అరకు వచ్చి దగ్గరుండి ఆక్రమణలు కొన్ని కూల్చివేయించారు. ఈ ఉద్యమం ఏజెన్సీ వ్యాపితమైంది.
- పి.అప్పలనర్స, ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం










