Oct 10,2023 08:52
  • హైకోర్టు,ఎసిబి కోర్టుల తీర్పులు
  • సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు

ప్రజాశక్తి,- అమరావతి : మూడు కేసులకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబానాయుడు ముందస్తు బెయిల్‌ కోరుతు దాఖలు చేసిన ఫిటిషన్లను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు సోమవారం నాడు వేరువేరు తీర్పులు వెలువడ్డాయి. మరో వైపు ఎసిబి ప్రత్యేక కోర్టు కూడా చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది. క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అంతకుముందు ఫైబర్‌ గ్రిడ్‌ కేసు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు అల్లర్ల కేసుల్లో వేర్వేరుగా దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి తీర్పులు వెలువరించారు. ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో ఈ వాదనలు ఈ నెల 5న పూర్తి అయ్యాయి. తాజాగా వెలువరించిన తీర్పులో..చంద్రబాబును నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయనేందుకు ఆధారాలు చూపలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పు కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై గతంలోనే వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌ను కూడా కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అంగళ్లులో జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసులో ముందు బెయిల్‌ ఇవ్వాలన్న చంద్రబాబు వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.

ఎసిబి కోర్టులో...

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటీషన్‌ను, సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను రెండింటిని ఎసిబి కోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు సోమవారం ఎసిబి కోర్టు న్యాయమూర్తి రెండు పిటీషన్‌లను కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు. అలాగే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో దాఖలు చేసిన పిటి వారెంట్లపై ౖ విచారణను నేటికి వాయిదా వేసింది.

సుప్రీంలో సుదీర్ఘ వాదనలు

చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు నేటీ(మంగళవారం)కి వాయిదా వేసింది. జస్టిస్‌ అనిరుద్‌ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది నేతత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందు సోమవారం వాదనలు సుదీర్ఘంగా సాగాయి. చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌ సాల్వే, సిద్దార్థ లూత్రా, అభిషేక్‌ సింగ్‌ మను వాదనలు వినిపించారు. 2021 సెప్టెంబర్‌ 7లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిందని, అందువల్ల 17ఏ వర్తిస్తుందని, గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని అన్నారు. సిఐడి తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసు దర్యాప్తు 2018కి ముందే ప్రారంభం అయిందని, కనుక 17ఏ వర్తించదని అన్నారు. హరీష్‌ సాల్వే స్పందిస్తూ కేసు దర్యాప్తు 2018కి ముందే జరిగిందని ప్రభుత్వం ఎటువంటి డాక్యుమెంట్‌ సమర్పంచలేదన్నారు.