ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల సొమ్ము అడ్డంగా దోచి చంద్రబాబు జైలుకెళ్తే టిడిపి సానుభూతిని సృష్టించుకునేందుకు తపన పడుతోందని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదొక దేశ సమస్యలా ప్రజలను నమ్మించేందుకు మేధావులనుకునే వారితో రోజూ ప్రకటనలు ఇప్పిస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని ఆధారాలతో దొరికినా బుకాయించడం టిడిపి వారికే చెల్లిందన్నారు. అమరావతిలో ఇన్నర్ రింగ్‌రోడ్డు, అసైన్డ్ భూముల అక్రమాలు అనేవి చాలా చిన్నవి అని, అమరావతి మొత్తం కుంభకోణాల మయమేనని చెప్పారు. అమరావతిలోని అవినీతినంతా బయటకు తెచ్చి చంద్రబాబు బండారాన్ని ప్రజల ముందు వుంచుతామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం ఏమీలేదన్నారు. సాక్ష్యాధారాలు వున్నాయనే కోర్టు రిమాండ్‌కు పంపిందన్నారు.










