Jun 28,2023 21:02
  • ఆలిస్‌ బ్లూ సిఇఒ సిధవేలాయుధం

చెన్నయ్ : స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులకు అధిక అధ్యయనం అవసరమని ఆలిస్‌ బ్లూ సిఇఒ సిధవేలాయుధం పేర్కొన్నారు. దీర్థకాలిక పెట్టుబడుల కోసం స్టాక్‌లు, ఈక్విటీ ఫండ్‌ల మధ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అనుభవం లేకపోతే ఇన్వెస్టర్లు నలిగి పోతారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ''మీ పెట్టుబడి దృక్పథం దీర్ఘకాలికంగా ఉంటే.. మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి మీకు సమయం, అనుభవం లేనట్లయితే.. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో ఎటువంటి సందేహం లేకుండా పెట్టుబడి పెట్టాలి. అయితే.. మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం స్టాక్‌లను పరిశోధించే నైపుణ్యాన్ని కలిగి ఉంటే, వాటిని క్రమ పద్ధతిలో పరిశీలించి, ఓపికను అలవర్చుకుంటే, మీరు విజయవంతమైన పెట్టుబడిదారుగా మారే అవకాశం ఉంది.'' అని పేర్కొన్నారు. చాలా మంది కొత్తగా పార్ట్‌ టైమ్‌ ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, ఈక్విటీ ఫండ్స్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేయడం మధ్య నలిగిపోతున్నారన్నారు. వ్యక్తిగత దీర్ఘకాలిక పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో సంపదను పోగుచేసుకోవడం నిజమే అయినప్పటికీ, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.