Sep 27,2023 21:00
  • ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ ముట్టడి
  • 'చలో విజయవాడ' జయప్రదం కోరుతూ విజయవాడలో పోస్టర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి-యంత్రాంగం : విద్యారంగ సమస్యలతోపాటు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం పలు జిల్లాల్లో ఆందోళన కొనసాగించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న చేపట్టిన 'చలో విజయవాడ'ను విజయవంతం చేయాలని ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.

kurnool


కర్నూలులో కలెక్టరేట్‌ను ముట్టడించారు. విద్యారంగ వినాశకర 77, 108, 108 జిఒలను రద్దు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు పెంచాలని, ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి కరువు స్కాలర్‌షిప్‌ కింద ప్రతి విద్యార్థికి రూ.10 వేలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు గేట్లు ఎక్కి కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. డిఆర్‌ఒ మధుసూదన్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధుల నుండి వినతిపత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఇచ్చిన హామీలు మాటలకే తప్ప అమలుకు నోచుకోలేదని తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి పథకాలలో ఎందుకు కోతలు విధించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి విద్యార్థులంతా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. సోమేశ్వరరావు, షేక్‌. జాహీదా తదితరులు పాల్గొన్నారు.