Oct 13,2023 10:50

ప్రజాశక్తి-అమరావతి : ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది. ఈలోగా సిఐడి తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఎసిబి కోర్టు బెయిల్‌ మంజూరుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారని, దర్యాప్తునకు సహకరిస్తామని, బెయిల్‌ షరతులను అమలు చేస్తామని పిటిషన్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు.
 

                                                                    లోకేష్‌ పిటిషన్‌ మూసివేత

ఎపి 'స్కిల్‌' కేసులో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నిందితుడిగా లేరని హైకోర్టుకు సిఐడి నివేదించింది. ఒకవేళ నిందితుడిగా చేర్చాల్సి వస్తే ఆయనకు సిఆర్‌పిసిలోని 14ఎ సెక్షన్‌ కింద నోటీసు జారీ చేస్తామని లిఖితపూర్వకంగా హైకోర్టుకు తెలియజేసింది. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలన్న లోకేష్‌ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని హైకోర్టు తేల్చింది. పిటిషన్‌ను మూసేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్‌ కేసులో సిఐడి ఒక్కసారిగా నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని లోకేష్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.
 

                                             అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై నేడు తీర్పు

అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. తీర్పును శుక్రవారం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ కె సురేష్‌రెడ్డి వెల్లడించారు.