Sep 30,2023 07:19
  • ముక్కలు చేసి ముంచేసే కేంద్రం కుట్రలు
  • సిఎంతో అదాని భేటీ అందుకేనా ?
  • ఆటలు సాగనివ్వం: ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పీక నులిమే కుట్రలను కేంద్ర ప్రభుత్వం మానుకోవడం లేదు. ఏదో ఒక మూల నుంచి 'ఉక్కు' ఊపిరిని లాగేసే ఎత్తుగడలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా విశాఖ స్టీల్‌ ప్లాంటుకు చెందిన భూములను తెగనమ్మే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ దిశలో కసరత్తు చేస్తున్న కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ కన్నుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలిసింది. అదానీ గ్రూప్‌ సంస్థల అధినేత గౌతమ్‌ అదానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో గుట్టుచప్పుడు కాకుండా భేటీ కావడానికి కూడా విశాఖ భూముల అంశమే కారణమని భావిస్తున్నారు. వాస్తవానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సొంతం చేసుకోవడానికి అదాని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కార్మికలోకం ప్రతిఘటనతో ఆ ప్రయత్నం ముందుకు సాగడం లేదు. దీంతో గంగవరం పోర్టును చేజిక్కంచుకుని ప్లాంటుకు అవసరమైన ముడిసరుకును సరఫరా కానీయకుండా అడ్డుకున్న విషయమూ తెలిసిందే. ఈ కక్ష సాధింపు చర్యను కూడా కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టింది. దీంతో భూములను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఉక్కు ఫ్యాక్టరీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే వ్యూహానికి తెరతీసినట్లు సమాచారం. ఈ కారణంగానే అదానీ భేటీ విషయాన్ని సిఎం కార్యాలయం రహస్యంగా ఉంచిందని భావిస్తున్నారు. వాస్తవానికి విశాఖ ఉక్కు భూముల విక్రయానికి సంబంధించి కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అదానీ విజయవాడ నుండి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఉక్కు ఫ్యాక్టరీ భూముల అమ్మకానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జోరందుకుంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ తొలి దశలో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1,400 ఎకరాల భూములను విక్రయించాలని గతంలోనే ప్రతిపాదించింది. దీనిలో భాగంగానే నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌తో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-స్టీల్‌ప్లాంట్‌)లు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మొత్తంగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ నియంత్రణలో సుమారు 20 వేల ఎకరాల భూమి ఉందని, వీటికి స్టీల్‌ మంత్రిత్వ శాఖ పవర్‌ ఆఫ్‌ అటార్నీగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
 

                                                                       రెండు వారాల క్రితమే...

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన భూములపై రెండు వారాల క్రితం ఒక ఎంఒయు జరిగింది. విశాఖ నగరంలోని హెచ్‌బి కాలనీలోగల 22.9 ఎకరాల ప్లాంట్‌ క్వార్టర్స్‌ భూమి ఖాళీగా ఉంది. రెండు ఎకరాలు గాజువాక, పెదగంట్యాడలోగల 500 గజాలు ఈ మూడు ప్రదేశాల్లోని భూములూ స్టీల్‌ప్లాంట్‌ పేరునే ఉన్నాయి. వీటిని విక్రయించేందుకు తొలి నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్‌ఐఎన్‌ఎల్‌ యాజమాన్యం, నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌, నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుని భూ అమ్మకాల అనంతరం నిధుల బదలాయింపు అకౌంట్లపై రెండు సంస్థలతో ఆర్‌ఐఎన్‌ఎల్‌ (ఒప్పందం) కుదర్చుకుంది. ఆ ప్రక్రియ సజావుగా ముగియడంతో తాజాగా పెద్ద మొత్తంలో భూములను తెగనమ్మడానికి కసరత్తు ప్రారంభించారని భావిస్తున్నారు.
 

                                                                  ఎంఒయు దేనిపై జరిగింది ?

భూముల వివరాలు, పత్రాలను ఎలా పరిశీలించాలి? ఈ భూములు ఎవరు అమ్మాలి? కొనుగోలు చేసినప్పుడు ఏ అకౌంట్లో డబ్బులు వేయాలి? అనే చర్చ ఎంఒయు సందర్భంగా చోటుచేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎస్క్రో ఖాతాను కూడా ప్రారంభించినట్లు సమాచారం.

                              నష్టపరిచే బిజెపి విధానం .. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోద్యరామ్‌

కేంద్రంలోని బిజెపి సర్కారు స్టీల్‌ప్లాంట్‌ను అస్థిరం పాల్జేసి, నష్టపరచాలని కుట్రలు చేస్తోందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యారామ్‌ విమర్శించారు. భూములు అమ్ముకుంటే ప్లాంట్‌ సమస్య పరిష్కారం అవుతుందా? అని ప్రశ్నించారు. జిఎస్‌టిలో కేంద్రం రాయితీ ఇవ్వొచ్చన్నారు. బిజెపి ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్లు కొద్దిమంది కార్పొరేట్లకు బ్యాంకు రుణాలు మాఫీ చేసిన మోడీ సర్కారు... విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.3 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ ఉన్న ఆస్తులు ఉన్నా, కేవలం రూ.10 వేల కోట్లు అప్పు పుట్టకుండా బ్యాంకులకు మోకాలడ్డుతోందని విమర్శించారు.