- సగం కూడా నిధులివ్వని పరిస్థితి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : అట్టడుగు వర్గాలను ఆదుకునేందుకు అమలు చేస్తున్న పథకాలకు నిధుల కొరత వేధిస్తోంది. బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేస్తున్నప్పటికీ, విడుదల, వ్యయానికి మాత్రం పొంతన కుదరడం లేదు. కేటాయింపులకు, వ్యయానికి మధ్య స్వల్ప తేడా ఉంటే అర్థం చేసుకోవచ్చు గానీ గత నాలుగేళ్లలో సగం మాత్రమే వ్యయం ఉండడం గమనార్హం.
ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికల్లో కేటాయింపులకు, వ్యయానికి మధ్య భారీ అంతరాలు కనిపిస్తున్నాయి. ఇంతలా కేటాయింపులు ఉన్నప్పటికీ ఆ నిధులు ఏమయ్యాయన్నదే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. కీలకమైన ఎస్‌సి ఉప ప్రణాళికకు నాలుగేళ్లలో ఏకంగా రూ.1,02,679 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. చివరిలో వీటికి అదనంగా మరో రూ.6,488 కోట్లు కేటాయించారు. మొత్తమ్మీద నాలుగేళ్లలో రూ.60,111 కోట్లు మాత్రమే వ్యయం చేయడం గమనార్హం. కేటాయింపులకు, వ్యయానికి మధ్య ఏకంగా రూ.42 వేల కోట్లకుపైగా తేడా ఉంది. ఎస్‌టి ఉప ప్రణాళిక నిధుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ నాలుగేళ్లలో రూ.35,515 కోట్లు కేటాయింపులు చేయగా, వ్యయం మాత్రం రూ.18,891 కోట్లుగానే రికార్డయ్యింది. ఈ రంగంలోనూ రూ.16 వేల కోట్లకు పైగా తగ్గుదల కనిపించింది. వెనుకబడిన తరగతుల వారికోసం రూ.72,495 కోట్లు కేటాయించగా, రూ.66,196 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మైనార్టీ విభాగంలో రూ.9,908 కోట్లు కేటాయించగా, రూ.6,867 కోట్లే ఖర్చు చేయగలిగారు. కాపులకు చేసే సాయం విషయంలో కేటాయింపుల కన్నా వ్యయం ఎక్కువగా కనిపించింది. నాలుగేళ్లలో రూ.10,457 కోట్లు కేటాయించగా, రూ.909 కోట్లు అదనంగా వ్యయం చేయడం గమనార్హం.
ఇతర అవసరాలకు నిధులు
కేటాయింపుల కన్నా రూ.67 వేల కోట్ల వరకు తక్కువగా వ్యయం చేయగా, ఆ నిధులు ఇతర అవసరాలకు మళ్లించినట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. ఉప ప్రణాళిక పేరున నిధులు కేటాయించడం, ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నట్లు తేలింది. అందుకే ఉప ప్రణాళికలకు అవసరమైన నిధుల కన్నా ఎక్కువ కేటాయింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.











