ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్ కోనసీమ) : ప్రధాన పంట కాలువల్లో గుర్రపు డెక్క చెత్తాచెదారం పేరుకుపోయి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన విషయంపై ''సాగునీటికి అవరోధం '' అనే శీర్షిక న ప్రజాశక్తి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన వార్త కు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. సమస్యను అధికారుల దృష్టికి తెచ్చినందుకు ప్రజాశక్తిని అభినందించారు.
ఈ మేరకు మంగళవారం ఇరిగేషన్ ఏఈ సుజాత సిబ్బందితో కలిసి ఇంజరం కెనాల్ లోను, శివల, కుడుపూరు వెళ్లే కాలువలను పరిశీలించారు. పేరుకుపోయిన చెత్త చెదారం, గుర్రపు డెక్కన్ ను కూలీలతో పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... ప్రతి ఏటా వర్షాకాలంలో గుర్రపు డెక్క, తూటి కాడ కాలువల్లో పెరిగిపోయి సాగునీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతాయి అని, వీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఇరిగేషన్ శాఖ చర్యలు చేపడుతుందని వివరించారు. ప్రతి ఏటా రైతులకు సాగునీటి ఎద్దడి లేకుండా తమ వంతు పనులు చేపడుతున్నామని అన్నారు. పంటకాలువలో నీటి ప్రవాహం పెంచేందుకు డి ఈ తో పాటు మిగిలిన అధికారులతో మాట్లాడి నీటి సాంద్రత పెంచామని, దీని ద్వారా ప్రస్తుతం తొలకరి రైతులకు సాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ప్రజాశక్తి దినపత్రికను ఆమె అభినందించారు.










