Feb 11,2023 16:35

నాగ్‌పూర్‌ : నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తు చేసింది. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన జడేజాకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా జడేజాకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సందర్భంగా జడేజా చేతికి క్రీమ్‌ రాసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఐసీసీ.. అతడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటన చేసింది.
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 46వ ఓవర్‌ వేయడానికి వచ్చిన జడేజా ఎడమ చేతి చూపుడు వేలికి క్రీమ్‌ రాసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, అభిమానులు జడేజా చీటింగ్‌ చేశాడని ఫోటోలు, వీడియోలతో సోషల్‌మీడియాలో ఆరోపణలు చేశారు. అయితే దీనిపై స్పందించిన బీసీసీఐ జడేజా వేలికి రాసుకున్నది నొప్పిని తగ్గించే ఆయింట్‌మెంట్‌ అని సష్టత ఇచ్చింది. యితే, ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లకు చెప్పకుండానే, వారి అనుమతి తీసుకోకుండానే జడేజా ఆయింట్‌మెంట్‌ రాసుకోవడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జడ్డూకు జరిమానా విధించడంతో పాటు డిసిప్లినరీ పాయింట్లలో ఒక పాయింట్‌ కోత విధించింది.