Sep 16,2023 09:12

రాజమండ్రి (తూర్పుగోదావరి) : రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ భార్య ఎస్‌.రాహుల్‌ భార్య కిరణ్మయి (46) శుక్రవారం రాత్రి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరుకు తీసుకెళ్లారు. ఈ వార్త తెలిసిన జైళ్ల శాఖ డిఐజి ఎంఆర్‌.రవికిరణ్‌, ఎస్పీ జగదీశ్‌ ఆస్పత్రికి వెళ్లి సంతాపం తెలిపారు.

                                            రాహుల్‌ సెలవును పొడిగిస్తున్నా : జైళ్ల శాఖ డిఐజి ఎంఆర్‌ రవికిరణ్‌

భార్య కిరణ్మయి అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ సెలవులపై వెళ్లారు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్‌ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్‌ స్పందిస్తూ ... ఆ వార్తలను కొట్టిపారేశారు. రాహుల్‌ తన భార్య అనారోగ్యం కారణంగానే సెలవుపై వెళ్లారని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని, తమ డ్యూటీ తాము చేస్తున్నామని తెలిపారు. ఈక్రమంలో ... కిరణ్మయి మరణించడంతో సూపరింటెండెంట్‌ రాహుల్‌ సెలవును పొడిగిస్తున్నట్లు జైళ్ల శాఖ డిఐజి ఎంఆర్‌ రవికిరణ్‌ తెలిపారు. ఆయన తిరిగి విధుల్లో చేరే వరకూ కేంద్ర కారాగార పర్యవేక్షణ బాధ్యతలు తానే నిర్వర్తిస్తానని చెప్పారు.