- అనంతపురం కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి
- సిపిఎం నాయకుల అరెస్టు, విడుదల
ప్రజాశక్తి -అనంతపురం కార్పొరేషన్:చెత్త, ఇంటి పన్ను తగ్గించాలని, టిడ్కో ఇళ్లను పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వార్యాన ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం నగరపాలక కౌన్సిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. సిపిఎం నగర నాయకులు ప్రకాష్, వలీ, వెంకటనారాయణ, మసూద్, ముస్కిన్, రాజు, బాలకృష్ణ తదితరులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. అంతకు ముందే సిపిఎం ఒకటవ నగర కార్యదర్శి రామిరెడ్డిని ఇంటి వద్దనే అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. నగరపాలక కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం నాయకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించడంలో నగర పాలకవర్గం విఫలం అయ్యిందని విమర్శించారు. వీధి కుక్కలు, పందులను వెంటనే నగరం నుంచి దూరంగా తరలించాలని, సెంట్రల్ పార్కును కాపాడి సుందరీకరణ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన తమను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.










