Feb 14,2023 21:57

న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌, పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత రన్నర్లు ప్రియాంక గోస్వామి, ఆకాశ్‌దీప్‌ సింగ్‌ అర్హత సాధించారు. రాంచీ వేదికగా జరిగిన ఓపెన్‌ నేషనల్‌ రేస్‌ వాకింగ్‌ కాంపిటీషన్‌ 20కిలోమీటర్ల వాకింగ్‌లో వీరిద్దరూ క్వాలిఫై మార్క్‌కు చేరుకొని నేరుగా అర్హత సాధించారు. క్వాలిఫికేషన్‌ మార్క్‌ సమయం 1:20.20సెకన్లు కాగా.. రాజస్తాన్‌కు చెందిన ప్రియాంక 1:28.50సెకన్లలోనే గమ్యానికి చేరింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక పేరుమీద జాతీయ రికార్డు 1:28.45సెకన్లుగా ఉండగా.. ఆ రికార్డును మాత్రం బ్రేక్‌ చేయలేకపోయింది. జాతీయ రికార్డు గ్రహీత ఆకాశ్‌ దీప్‌ 1:19.55సెకన్లలోనే గమ్యానికి చేరాడు. ఈ క్రమంలో క్వాలిఫికేషన్‌ 1:20.10సెకన్లు మార్క్‌కు ముందే చేరుకున్నాడు. మరో జాతీయ క్రీడల రికార్డు గ్రహీత సందీప్‌ కుమార్‌ 1:20.16సెకన్లలో గమ్యానికి చేరాడు. ఇక సూరజ్‌ పన్వార్‌ 1:20.11సెకన్లలో గమ్యానికి చేరి 0.01సెకన్లలో వ్యత్యాసంతో తృటిలో ఈ రెండు క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. 2023లో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు, 2024లో పారిస్‌ ఒలింపిక్స్‌ జరగనున్నాయి.