Sep 16,2022 21:26

జాతీయ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మానవహక్కుల కమిషన్‌ బోర్డు సభ్యులు నర్సింహా
ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (కృష్ణా) :
ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల్లో సంచార జాతులు, వెనుకబడిన కులాల వారికి ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మానవహక్కుల కమిషన్‌ బోర్డు సభ్యులు తురక నర్సింహా సూచించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ కార్యాలయం స్పందన మీటింగ్‌ హాలులో శుక్రవారం కలెక్టర్‌ రంజిత్‌ బాషాతో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహా మాట్లాడుతూ కుల వివక్ష, ప్రజల మధ్య అంతరాలు మన సమాజంలో బలంగా పాదుకొను పోయాయని, డి-నోటిఫైడ్‌, సంచార, ఉప-సంచార తెగల వారి నిమిత్తం కేంద్ర ప్రభుత్వం జాతీయ కమిషన్‌ను (ఎన్‌సిడిఎన్‌టి) ఏర్పాటు చేసిందన్నారు. మన రాష్ట్రంలో సంచార జాతులకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డు, ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యా, వైద్యం, ఆర్థిక, సాంఘిక తదితర రంగాల్లో సంచార జాతులు ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం కఅషి చేస్తోందన్నారు. డి-నోటిఫైడ్‌, సంచార జాతులు, ఉప సంచార జాతుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడానికి నీతీ ఆయోగ్‌ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేశారుని తెలిపారు. నీతి ఆయోగ్‌, ఆంత్రోపోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో (ఎఎన్‌ఎస్‌ఐ) డిఎన్‌టి కమ్యూనిటీలను గుర్తించి వాటిని ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి విభాగంలో చేర్చేందుకు సర్వే జరుగుతోందన్నారు. 'స్కీమ్‌ ఫర్‌ ఎకనామిక్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ డిఎన్‌టి కమ్యూనిటీస్‌ (ఎస్‌ఇఇడి)' అనే ప్రత్యేక పథకాన్ని ఆమోదించిందని తెలిపారు.