భారత స్వాతంత్య్ర పోరాటం ప్లాటినం జూబ్లీ సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖ మన్యపోరాటాన్ని స్మరిస్తూ భారత తపాలా శాఖ ఆరు కవర్లను విడుదల చేసింది. ఈ ఆరూ మన్యవీరుల పోరాటంలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబిస్తాయి. మన్యం వీరుల పోరాట సన్నివేశం, మిరపకాయ టపా, గామ్ మల్లుదొర, పండు పడాల్, శంఖవరంలో వీరులకు స్వాగతం, కేడీ పేటలోని స్మారక మందిరం ముఖచిత్రాలుగా ఈ కవర్లను రూపొందించారు. ఆ సన్నివేశాల సందర్భాలను క్లుప్తంగా హిందీ, ఇంగ్లీషు భాషల్లో వివరించారు. స్థానిక ప్రజలకు తెలిసేవిధంగా తెలుగులోనూ ముద్రిస్తే బాగుండేది. 2021 ఆగస్టు 22 మొదలుకొని 2022 ఏప్రిల్ 18 వరకూ ఈ కవర్లను ఆయా ఉద్యమ ప్రాంతాల్లో విడుదల చేశారు. 1986లో అల్లూరి ముఖచిత్రంతో తపాలా బిళ్ల విడుదల అయింది. 2022 ఏప్రిల్ 2 ఉగాది రోజున పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడింది.










