Sep 27,2023 22:15

సభ నుంచి వాకౌట్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్‌ బిల్లును ప్రవేశపెట్టడంపై శాసనమండలిలో పిడిఎఫ్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నిలువునా మోసం చేసిందన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ బిల్లును ప్రవేశపెట్టగానే పిడిఎఫ్‌ సభ్యులు తీవ్రంగా స్పందించాకరు. ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ షాబ్జి, స్వతంత్ర ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ నిరసన వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారని నాలుగు ఏళ్లుగా ఈ హామీని పట్టించుకోకుండా ఇప్పుడు జిపిఎస్‌ తెరపైకి తెచ్చి చట్టం చేయడం ఏమిటని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది సిపిఎస్‌ ఉద్యోగులను నమ్మించి నిలువునా మోసం చేశారని అన్నారు. ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ షాబ్జి, రఘువర్మ పోడియంపైకి ఒక్కసారిగా దూసుకువెళ్ళి బిల్లును ఆమోదించవద్దని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. బిల్లు ప్రతులను చింపి గాల్లోకి వేశారు. పోడియంపై నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'చీటింగ్‌..చీటింగ్‌' అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీల నిరసన మధ్యనే బిల్లు ఆమోదం పొందినట్టు చైర్మన్‌ ప్రకటించారు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తే ముగ్గురు ఎంఎల్‌సిలు సభ నుండి వాకౌట్‌ చేశారు.