ప్రజాశక్తి-అమరావతి బ్యూరో/ కడప ప్రతినిధి : వైసిపి ప్రభుత్వం నవరత్నాలు పేరుతో నవమోసాలు చేస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. నాలుగేళ్లలో రూ.9,39,799 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారని, అందులో సంక్షేమానికి రూ.1,52,290 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. ఇది బడ్జెట్‌లో కేవలం 16.20 శాతం మాత్రమే అని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల బడ్జెట్ రూ.7,08,623 కోట్లు అని పేర్కొన్నారు. ఇందులో సంక్షేమానికి 18.21 శాతం ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు 12.5 లక్షలు ఉన్నాయని, వాహనమిత్ర కింద జగన్ 2,75,000 మందికి మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. ధరలు, పన్నులు పెంచకుండా సంపద సృష్టించి జగన్ కంటే అదనంగా సంక్షేమానికి ఖర్చు చేశామని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు రూ.16 వేల కోట్ల బకాయిలు పెట్టిందని, రైతులకు ధాన్యం బిల్లులు ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.750 కోట్ల బకాయిలు ఉన్నాయని వివరించారు. కృష్ణా, గోదావరి జలాలపై హక్కుల్ని కేంద్రానికి, తుంగభద్రపై హక్కుల్ని కర్ణాటకకు తాకట్టు పెట్టారని, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని దెబ్బతీసి నదుల అనుసంధానానికి గండికొట్టారని పేర్కొన్నారు.
నేడు రాత్రి 7గంటలకు టిడిపి నిరసన
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 'మోత మోగిద్దాం' పేరుతో శనివారం రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ప్రజలంతా శబ్దం చేసి చంద్రబాబుకు మద్దతు పలకాలని కోరారు. గంట కొట్టడం, విజిల్ వేయడం, హారన్ కొట్టడం, ప్లేట్లను కొడుతూ చప్పుడు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేస్తోంది కక్షపూరిత రాజకీయాలు అని చాటి చెప్పాలన్నారు.
అనంతబాబును వైసిపిలో ఎందుకు కొనసాగిస్తున్నారు? : నక్కా ఆనంద్‌బాబు
దళితుడిని చంపిన అనంతబాబును ఎందుకు వైసిపిలో కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వైసిపి నేతలే హత్యలు, అత్యాచారాలు, ధూషణలు, దాడులకు తెగబడుతున్నా ఏనాడూ జగన్ స్పందించలేదని విమర్శించారు. వైసిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మొక్కుబడిగా చేతులు దులుపుకుందన్నారు. మరలా వైసిపి సమావేశంలో అతనికి జగన్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చి పక్కనే కూర్చొబెట్టి రాచమర్యాదలు చేయడమేంటని ప్రశ్నించారు.
'ఔటర్' ఆరోపణలు అర్థరహితం
ఔటర్, ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం అర్థరహితమని, విజయవాడలో ఔటర్ రింగు రోడ్డే లేకుంటే అవినీతి ఎక్కడ చోటుచేసుకుందో చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడుతో కలిసి నంద్యాలకు వెళ్తున్న సందర్భంగా కడప ఎయిర్‌పోర్టులో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును ఎక్కడ అరెస్టు చేశారో అక్కడ నుంచే కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. నంద్యాల కేంద్రంగా నిర్వహించనున్న పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. జనసేనతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.










