Jan 11,2023 21:32

న్యూఢిల్లీ : గూగుల్‌ ప్లే స్టోర్‌ అనైతిక వ్యాపార పద్దతులపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) నిరాకరించింది. సిసిఐ విధించిన జరిమానా మొత్తం రూ.936.44 కోట్లలో 10 శాతం సొమ్మును నాలుగు వారాల్లో తమ రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేసింది. ప్లే స్టోర్‌ విధానాల్లో గుత్తాధిపత్యాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తుండటంతో సిసిఐ రూ.936.44 కోట్ల భారీ జరిమానా విధించింది. కాగా.. వారంలోనే ఎన్‌సిఎల్‌టిలో గూగుల్‌కు రెండో సారి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. ఇటీవల ఆండ్రాయిడ్‌ మొబైల్‌ విభాగంలో గూగుల్‌ గుత్తాధిపత్యంపై సిసిఐ రూ.1,338 కోట్ల జరిమానా వేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌సిఎల్‌టిని ఆశ్రయించగా.. తొలుత ఈ జరిమానా మొత్తంలో 10 శాతం సొమ్మును డిపాజిట్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్ని గూగుల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. 16న విచారణకు రానుంది.