Jun 08,2022 22:12

- ఈ సారీ స్వామినాథన్‌ సిఫారసులు గాలికి
- రైతుకు భారీ నష్టం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధిా అమరావతి :
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) విషయంలో కేంద్ర బిజెపి సర్కారు మరోసారి రైతులను నిట్టనిలువునా మోసం చేసింది. డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు పంటలు పండించడానికి రైతు చేసే సమగ్ర వ్యయం (సి2)కు 50 శాతం కలిపి ధర ప్రకటించాల్సి ఉండగా ఆ పని చేయలేదు. అరకొరగానే రానునున్న ఖరీఫ్‌ పంటలకు ఎంఎస్‌పి నిర్ణయించింది. దానికే ఎంతో పెంచేసి రైతులకు తోడ్పాటిచ్చినట్లు, వారి ఆదాయాలను రెట్టింపు చేస్తున్నట్లు గొప్పలకు పోతోంది. గడచిన ఏడాదిలో పంటలు పండించేందుకు రైతులు చేసిన ఖర్చులపై అధ్యయనం చేసిన వ్యవసాయోత్పత్తుల వ్యయాలు, ధరల కమిషన్‌ (సిఎసిపి) మరుసటి ఏడాదికి ఎంఎస్‌పిలను సిఫారసు చేసింది. 2022-23 సిఎసిపి నివేదికలో పేర్కొన్న విధంగా సి2+50 శాతం మేర మోడీ ప్రభుత్వం ఎంఎస్‌పి నిర్ణయించలేదు. కేవలం రైతులు ఉత్పాదకాలకు పెట్టే ఖర్చు (ఎ2), దానికి రైతు కుటుంబ శ్రమ (ఎ2+ఎఫ్‌ఎల్‌)ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఎంఎస్‌పి ప్రకటించింది. ఉదాహరణకు క్వింటా సాధారణ రకం వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి సి2 రూ.1,805 అని సిఎసిపినే తెలిపింది. దానికి 50 శాతం కలిపి ఎంఎస్‌పి నిర్ధారించాలి. అప్పుడు రూ.2,707.50 అవుతుంది. కానీ కేంద్రం సిఎసిపి పేర్కొన్న ఎ2+ఎఫ్‌ఎల్‌ రూ.1,360నే ప్రామాణికంగా తీసుకుంది. ఆ లెక్కన రూ.2,040 ప్రకటించింది. క్వింటాకు రూ.667.50 తక్కువ ప్రకటించింది. ఎకరాకు 20 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే రైతుకు రూ.13,350 నష్టం. కాగా ప్రభుత్వం గతేడాది కంటే రూ.100 పెంచామని ప్రచారం చేసుకుంటోంది. దాదాపు అన్ని పంటలదీ ఇదే పరిస్థితి.

rrr