ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం మోస్తారు వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. సులభం పంచాయతీ బెల్లంగరువు గ్రామంలో పిడుగుపాటుకు గిరిజన రైతుకు చెందిన మూడు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. పాడేరు, అరకులోయ, అనంతగిరిల్లోనూ వర్షం కురిసింది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో చిరుజల్లులు పడ్డాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పట్టణ రహదారులపై వరదనీరు ప్రవహించడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పెనుమంట్ర మండలల్లో, ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి, ఏలూరు, పెదపాడు, దెందులూరు, పెదవేగి తదితర మండలాల్లో వర్షం కురిసింది. తిరుపతిలో ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు కురిశాయి.










