- 'కార్పొరేషన్'తో కూలీల కష్టాలు
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో శెట్టిపల్లి పంచాయతీలోని ఐదు గ్రామాలను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే వేలాదిమందికి సంబంధించిన శెట్టిపల్లి భూముల 'ల్యాండ్ పూలింగ్' సమస్య దశాబ్దాలుగా అపరిష్కృతంగానే ఉంది. దీనికితోడు తిరుపతిలో విలీనం కావడంలో ఉపాధి హామీ పనులూ లేకుండా పోయాయి. ఉపాధి హామీనే నమ్ముకుని జీవిస్తున్న ఐదు గ్రామాల్లోని 320 మంది కూలీలు పనులు కోల్పోవడమే కాదు, 'ఉపాధి' పనులే ఇక లేవని పంచాయతీ అధికారులు చెప్పడంతో లబోదిబోమంటున్నారు. ఇదేమని అడిగితే పట్టణాల్లో ఉపాధి హామీ పనులు ఉండవని ఉపాధి హామీ సిబ్బంది తేల్చేశారు.
తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి పంచాయతీలో మొత్తం 11 గ్రామాలు ఉన్నాయి. చంద్రగిరి, తిరుపతి శాసనసభ్యుల సొంత భూములకు 'విలువ' పెంచుకోవడం కోసమే విలీనం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పది రోజుల క్రితం శెట్టిపల్లి పంచాయతీలోని శెట్టిపల్లి, శెట్టిపల్లి దళితవాడ, సిఆర్‌ఎస్, వినాయకనగర్ సాగర్, ఉప్పరపాలెం గ్రామాలను తిరుపతి కార్పొరేషన్‌లో విలీనం చేసినట్లు కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి వెల్లడించారు. అప్పటివరకూ పంచాయతీ పరిధిలో పన్నులు కట్టుకుంటున్న గ్రామస్తులు, ఇక నగర పరిధిలో పెద్దమొత్తంలో పన్నులు కట్టాల్సి వస్తుందన్న ఆందోళన ఆ గ్రామస్తుల్లో కనిపిస్తోంది. ఈ ఐదు గ్రామాలను పరిశీలిస్తే ఉపాధి హామీ జాబ్‌కార్డులు పొందినవారు 500 పైగా ఉన్నారు. వారిలో నిత్యం పనులకు వెళుతూ 320 మంది ఉన్నారు. రోజుకు 300 రూపాయలు సంపాదించుకునేవారు. ఎక్కువమంది పాడి పరిశ్రమపై ఆధారపడిన వారే ఈ ఉపాధి పనుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఐదు గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయడంతో వారు రోడ్డున పడినట్లయ్యింది.

నగరాల్లో ఉపాధి హామీ అమలు చేయాలి : టి.సుబ్రమణ్యం, సిపిఎం
గ్రామాల్లో ఏ విధంగా ఉపాధి హామీ పనులు అమలు చేస్తున్నారో అదే విధంగా నగరాల్లోనూ అమలు చేయాలి. ఏడాదిన్నర క్రితం తిరుపతి రూరల్‌లో ఉన్న ఏడు పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. వారికీ ఉపాధి హామీ పనులు లేకుండా పోయాయి. ప్రస్తుతం శెట్టిపల్లి పరిధిలోని ఐదు గ్రామాలను తాజాగా విలీనం చేశారు. వారందరికీ తాత్కాలికంగానైనా కార్పొరేషన్‌లో కూలి పనులు కల్పించాలి.

ఉపాధి పని లేకుండా పోయింది : కె.చంద్రయ్య, శెట్టిపల్లి
పట్టణంలో పెయింటింగ్ పని చేసుకుంటూ దినసరి కూలీగా బతికేవాన్ని. వయస్సు సహకరించకపోవడంతో ఉపాధి హామీ పనులతో రోజుకు 250-300 రూపాయలు సంపాదించుకునే వాన్ని. వంద రోజులు పని కావాలని కోరుకుంటే, విలీనంతో అసలు పనే లేకుండా పోయింది.

మా పిల్లల చదువు ఎలా సాగుతుంది? : ఎ.రాజేశ్వరి, శెట్టిపల్లి
ఉదయం కరువు పనులకు పోయి మధ్యాహ్నం కల్లా ఇంటికొచ్చి, పిల్లలకు వంట చేసి చదివించుకునేవాళ్లం. మధ్యాహ్నం నుంచి పశువులు మేపుకుని సాయంత్రం పాలు పిండి కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం.










