Oct 11,2023 11:01
  • రీజనల్‌ కో ఆర్డినేటర్‌లతో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చేపట్టిన బస్సు యాత్రను జయప్రదం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ మాట్లాడుతూ సామాజిక న్యాయ యాత్ర పేరిట చేపట్టనున్న బస్సుయాత్రను విజయవంతం చేయడానికి ప్రాంతాల వారీగా బాధ్యతలను తీసుకొని పనిచేయాలన్నారు. దసరా పండుగ తర్వాత అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బస్సు యాత్ర సందర్బంగా బహిరంగ సభలు జరగాలన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనుంచి ప్రతి రోజూ ఒక మీటింగు చొప్పున మొత్తంగా మూడు మీటింగులు నిర్వహించాలన్నారు.. స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్‌ఛార్జి సహా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీవర్గాలకు చెందిన నాయకులు ఈ సభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ రెండునెలలపాటు ఈ బస్సు యాత్రను నిర్వహించాలన్నారు. విజయవాడలో పార్టీ ఇచ్చిన పిలుపును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో గహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, ఎంపిటిసిలు, సర్పంచులు, వలంటీర్లు పాల్గొనేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డి, సజ్జల రామకష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మర్రి రాజశేఖర్‌, ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్‌, లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.