విజయవాడ: సీఎం జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ బహిరంగ లేఖ రాశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపై, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్ స్పందించాలన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అవినీతిపై సీఎంగా దర్యాప్తుకు ఆదేశించాలని.. లేదంటే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి ఉంటుందని తెలిపారు. ఇసుక కాంట్రాక్టులు అక్రమంగా ఇప్పిస్తామని వెల్లంపల్లి కుటుంబ సభ్యులు చీటింగ్ చేశారని మండిపడ్డారు. బ్రాహ్మణ వీధిలోని కొత్తగుళ్ల వెంకటేశ్వర స్వామికి చెందిన రూ.350 కోట్ల దోపిడీకి ప్రయత్నించారన్నారు. బోగవల్లి సత్రం ట్రస్ట్‌కు చెందిన విలువైన భూములు తన పీఏ ద్వారా అక్రమ అగ్రిమెంట్లు చేశారన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి గుడిలో చోరీ చేసిన మూడు సింహాల ఘటనపై, దుర్గగుడిలో తన బినామీలకు శానిటేషన్, క్యూరిటీ అక్రమ కాంట్రాక్టులు ఇప్పించి కోట్ల రూపాయలు కొట్టేసిన అంశంపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అస్లాం మఅతి కేసును పక్కదారి పట్టించేందుకు పెద్ద ఎత్తున వసూళ్లు చేశారన్నారు. దేవాదాయ, ప్రభుత్వం స్థలాల కబ్జాపై కూడా విచారణ చేయాలని పోతిన వెంకట మహేష్ లేఖలో పేర్కొన్నారు.










