ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నందిగామ పట్టణాన్ని తీర్చిదిద్దుతామని నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నందిగామ పట్టణంలోని సిఎం రోడ్డు విస్తరణ - అభివృద్ధి పనులలో భాగంగా రూ.38 లక్షలతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ పట్టణానికి ప్రత్యేక నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అభివఅద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అందులో భాగంగానే పట్టణంలో రోడ్ల నిర్మాణం -సిసి డ్రైన్ ల నిర్మాణాలు - ఇంటింటికి కుళాయి నిర్మాణ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా పట్టణీకరణలో భాగంగా సిఎం రోడ్డు విస్తరణ -అభివృద్ధి పనులు చేపట్టాలని , రోడ్డు విస్తరణకు సహకరించిన సిఎం రోడ్డు నివాసితులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. సిఎం రోడ్డులో ఇప్పటికే ఇరువైపులా పక్కా డ్రైనేజీలు, విద్యుత్ దీపాలంకరణ పనులు పూర్తయ్యాయని - సిఎం రోడ్డు ను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని అన్నారు. త్వరలోనే నందిగామ నగర పంచాయతీ గ్రేడ్-2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అవుతుందన్నారు. తద్వారా మరింత అభివృద్ధి జరగడానికి ప్రత్యేక నిధులు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ ఎస్.జయరాం, మున్సిపల్ ఎఇ జె.ఫణి శ్రీనివాసరావు, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ఖాలిక్, మారం అమరయ్య, కట్టప్ప, వైసిపి నాయకులు గుడివాడ సాంబశివరావు, మస్తాన్, మండవ పిచ్చయ్య, కఅపారావు, జాఫర్, కార్యకర్తలు పాల్గొన్నారు.










