ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ - ప్రజల సమస్యలను నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ ... గత ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ము కాసిందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ఇంటింటికి సిఎం జగన్ అందజేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల సుందరమ్మ, జడ్పిటిసి గాదెల బాబు, గ్రామ సర్పంచ్ నెలకుదుటి శిరీష, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోనెల సీతారామయ్య, మండల పార్టీ అధ్యక్షులు నెలకుదిటి శివ నాగేశ్వరరావు, తహశీల్ధార్ నరసింహారావు, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వరరావు, పలువురు ఎంపీటీసీలు రామిరెడ్డి సీతయ్య, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










