ట్రిపోలి : 165 మంది నైజీరియన్ శరణార్థులను బహిష్కరించినట్లు లిబియాన్ ప్రభుత్వం పేర్కొంది. స్వచ్ఛంద రిటర్న్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సమన్వయంతో బహిష్కరణ జరిగినట్లు తెలిపింది. 165 మంది అక్రమ వలసదారులను నైజీరియాకు తిరిగి పంపామని లిబియా అక్రమ వలస వ్యతిరేక ఏజన్సీ ప్రతినిధి కల్నల్ హైథమ్ తెలిపారు. బహిష్కరించిన వారిలో 90 మంది మహిళలు, తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారని అన్నారు. మహిళలు మరియు చిన్నారులను ట్రిపోలిలోని అక్రమ వలసదారుల ఏజన్సీ ప్రధాన కార్యాలయంలో పోలీసుల పర్యవేక్షణలో ఉంచామని, వారికి అవసరమైన ఆహారం, ఇతర సామగ్రిని అందించినట్లు అధికారులు తెలిపారు. వలసదారులను ట్రిపోలీలోని మిటిగా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఓ ప్రైవేట్ విమానంలో తరలించామని అన్నారు. ఇతర విమానాలు వచ్చే వారం నైజీరియాకు నడుస్తాయని చెప్పారు. ఈ ఏడాది మొత్తంగా 7,477 మంది అక్రమ వలసదారులను గుర్తించి, తిరిగి వారి దేశాలకు తరలించామని అంతర్జాతీయ వలసదారుల సంస్థ ఓ నివేదికలో పేర్కొంది.










